Begin typing your search above and press return to search.

వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ కు హైకోర్టు షాక్‌!

By:  Tupaki Desk   |   1 July 2022 9:30 AM GMT
వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ కు హైకోర్టు షాక్‌!
X
బాప‌ట్ల జిల్లా చీరాల వైఎస్సార్సీపీ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జి ఆమంచి కృష్ణ‌మోహ‌న్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. త‌న‌పై సీబీఐ అధికారుల విచార‌ణ ఆపాల‌ని ఆమంచి దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను హైకోర్టు తోసిపుచ్చింది. త‌దుప‌రి విచార‌ణ‌ను జూలై 15కి వాయిదా వేసింది. ఇప్ప‌టికే న్యాయ‌మూర్తుల‌ను, హైకోర్టును దూషించిన కేసులో ఒకసారి ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ను సీబీఐ అధికారులు విచారించారు. రెండోసారి విచార‌ణ‌కు జూన్ 22న‌ హాజ‌రుకావాల‌ని ఆయ‌నకు నోటీసులిచ్చారు.

అయితే త‌న‌కు వారం రోజుల గ‌డువు కావాల‌ని ఆమంచి కృష్ణ‌మోహ‌న్ విన్న‌వించ‌డంతో సీబీఐ ఆయ‌న‌కు ఆ గ‌డువు ఇచ్చింది. అయితే వారం రోజుల గ‌డువు పూర్త‌య్యాక ఆమంచి విచార‌ణ‌కు హాజ‌రు కాకుండా హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. త‌న విచార‌ణ‌పై స్టే ఇవ్వాల‌ని కోరారు. అయితే హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇవ్వ‌డానికి నిరాక‌రించింది. అదే సమయంలో సోషల్ మీడియా పోస్టుల కేసులో ప్రతివాదులుగా ఉన్న సీబీఐతో పాటు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కూ నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై విచారణను జూలై 15కు వాయిదా వేసింది.

కాగా వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి తీసుకుంటున్న ప‌లు నిర్ణ‌యాల‌కు వ్య‌తిరేకంగా హైకోర్టులో తీర్పులు వ‌చ్చాయి. కొన్ని నిర్ణ‌యాల‌పై హైకోర్టు ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. దీంతో హైకోర్టును, హైకోర్టు న్యాయ‌మూర్తుల‌ను నిందిస్తూ, దూషిస్తూ, వారిపై కొంద‌రు అభ్యంత‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. వీరిలో ఎక్కువ‌మంది వైఎస్సార్సీపీ నేత‌లే. అలాగే ఆ పార్టీ సోష‌ల్ మీడియా విభాగం కార్య‌క‌ర్త‌లు ఉన్నారు. ఈ దూష‌ణ‌ల‌పై తీవ్రంగా స్పందించిన హైకోర్టు సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించింది.

దీంతో ఈ కేసును అప్ప‌టి నుంచి సీబీఐ విచారిస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురికి నోటీసులు జారీ చేసి విచారించింది. విదేశాల్లో ఉన్న వైఎస్సార్సీపీ సానుభూతిప‌రుడు పంచ్ ప్ర‌భాక‌ర్ కూడా త‌న యూట్యూబ్ చాన‌ల్ లో హైకోర్టు న్యాయ‌మూర్తుల‌ను దూషించ‌డంతో అత‌డిపై కూడా కేసు న‌మోదు చేసింది. అంతేకాకుండా అత‌డి యూట్యూబ్ చాన‌ల్ ను రాకుండా నిషేధం విధించేలా చేశారు. అప్ప‌టి నుంచి పంచ్ ప్ర‌భాక‌ర్ విదేశాల్లోనే దాక్కున్నాడు.

న్యాయవ్యవస్ధపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో సీబీఐ విచారణ పూర్తి చేసి హైకోర్టుకు నీవేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే కేసులో మిగతా నిందితులపై ఇప్పటికే పలుమార్లు హైకోర్టుకు సీబీఐ నివేదికలు అందజేసింది.

కాగా ఆమంచి కృష్ణ‌మోహ‌న్ 2009, 2014లో చీరాల నుంచి ఘ‌నవిజ‌యం సాధించారు. 2009లో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా, 2014లో న‌వోదయం పార్టీ (ఇండిపెండెంట్‌)గా పోటీ చేసి గెలుపొందారు. అయితే వైఎస్సార్సీపీ గాలి బ‌లంగా వీచిన 2019లో మాత్రం చీరాల నుంచి ఓడిపోయారు. ప్ర‌స్తుతం చీరాల వైఎస్సార్సీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జిగా కొన‌సాగుతున్నారు.