దళితబంధుకు హైకోర్టు బ్రేక్.. కేసీఆర్ కు మైనస్ నా?

Thu Oct 28 2021 11:35:25 GMT+0530 (IST)

High court sensational decision on Dalitbandhu

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. హుజూరాబాద్ లో దళితబంధు నిలిపివేత అంశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పునిచ్చింది. ఈసీ ఉత్తర్వులు రద్దు చేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.ఈసీ నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోమని హైకోర్టు తేల్చి చెప్పింది. హుజూరాబాద్ లో ఉప ఎన్నిక నేపథ్యంలో దళితబంధు పథకాన్ని నిలిపివేయాలని ఇటీవల ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై టీఆర్ఎస్ తోపాటు పలువురు కోర్టుకు ఎక్కడంతో విచారణ జరిపిన కోర్టు తాజాగా ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఉప ఎన్నికల వేళ.. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ‘దళితబంధు’ పథకాన్ని అమలు చేయకుండా కొందరు కోర్టుకు ఎక్కిన సంగతి తెలిసిందే.. ఈ పథకాన్ని అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో ‘ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలైంది. జనవాహినీ పార్టీ జైస్వరాజ్ పార్టీ తెలంగాణ రిపబ్లిక్ పార్టీల కార్యదర్శులు సంగీత రత్నమాల ఆనంద్ లు ఈ పిల్ దాఖలు చేశారు.

ఇక మరో పిల్ కూడా హైకోర్టులో దాఖలైంది. రాష్ట్రవ్యాప్తంగా 16 ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉన్నాయని.. అక్కడ దళితబంధు అమలు చేయకుండా జనరల్ నియోజకవర్గం హుజూరాబాద్ లో అమలు చేయడం చట్టవిరుద్ధమని సామాజిక కార్యకర్త అక్కడ సురేష్ కుమార్ మరో పిల్ దాఖలు చేశారు.

ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టీఆర్ఎస్ పార్టీ ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని.. ఈ వ్యవహారాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు. ఈ పిల్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి సీఎం కేసీఆర్ కేంద్ర ఎన్నికల కమిషన్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ తోపాటు కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ పార్టీల కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు.

నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి రూ.10 లక్షలు బదిలీ చేస్తామని చెబుతున్న నేపథ్యంలో ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్సీ నియోజకవర్గాల్లో మాత్రమే ఈ పథకాన్ని అమలు చేసేలా ఆదేశించాలని కోరారు. ఈ రెండు పిల్ లు వచ్చేవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

అయితే ఎన్నికల వేళ ఈ పథకాన్ని ఆపుచేయడం ఖచ్చితంగా టీఆర్ఎస్ ఓటు బ్యాంకుపై ప్రతాపం చూపుతుందని విశ్లేషకులు అంటున్నారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ వరద బాధితులకు ఇంటికి రూ.10వేలు పథకం ప్రకటించి కోర్టు ఆదేశాలతో నిలిపివేసిన టీఆర్ఎస్ సర్కార్ కు గట్టి దెబ్బ తగిలింది. జనాలు బీజేపీకి ఓట్లు వేసి గెలిపించారు. ఇప్పుడే అదే జరుగబోతోందని.. దళితులు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మారే అవకావం ఉందంటున్నారు. టైంకు అమలు చేసిన టీఆర్ఎస్ కు ఇది మైనస్ అని అంటున్నారు.

-దళితబంధు పథకం ఇదీ..

దళిత బంధు పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరుగుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. కాళ్లు రెక్కలు మాత్రమే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా దళిత బంధు పథకం ఉంటుందని అన్నారు. అర్హులైన దళితులందరికీ దళిత బంధు పథకం అమలు చేస్తామని.. దశల వారీగా అమలు చేసే ఈ పథకం కోసం రూ.80వేల కోట్ల నుంచి రూ.1 లక్షల కోట్ల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా హుజూరాబాద్ లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యే ఈ దళిత బంధు కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచి దేశ దళితులందరినీ ఆర్థిక సామాజిక వివక్షల నుంచి విముక్తులను చేయబోతున్నదని సీఎం తెలిపారు. అందుకు పట్టుదలతో అందరం కలిసి పథకం విజయవంతం అయ్యేందుకు కృషి చేద్దామని.. సంఘాల నేతలకు దళిత ప్రజాప్రతినిధులకు మేధావులకు కేసీఆర్ పిలుపునిచ్చారు.