ఎస్ఈసీ నిమ్మగడ్డ తీరుపై అనుమానం కలుగుతోంది: హైకోర్టు

Tue Feb 23 2021 13:00:02 GMT+0530 (IST)

High Court slams Election Commissioner Nimmagadda

ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి సహాయ సహకారాలు అందించాలని ఆదేశిస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సక్రమంగా అమలు చేయలేదని న్యాయస్థానం ప్రభుత్వంపై మండిపడింది. ఎస్ఈసీ నిమ్మగడ్డకు మంజూరైన పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోలేదని.. నిధులు మంజూరు చేయలేదని ఆక్షేపించింది.కోర్టు ఉత్తర్వులను కూడా అధికారులు అమలు చేయలేదని హైకోర్టు సీరియస్ అయ్యింది. ఈ వ్యవహారంలో కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని గతంలో సీఎస్ డీజీపీని ఆదేశించింది. వారు రాతపూర్వకంగా లాయర్ ద్వారా అఫిడవిట్లు దాఖలు చేశారు. దీనిపై తాజాగా హైకోర్టులో విచారణ జరిగింది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సదుద్దేశాలపై తమకు అనుమానాలు కలుగుతున్నాయని హైకోర్టు తాజాగా ఘాటుగా వ్యాఖ్యానించింది.  ఎన్నికల సంఘానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్న తమ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయకుంటే వెంటనే ఎందుకు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయలేదని ప్రశ్నించింది. ఆ తరువాత కూడా కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసి అది విచారణకు రాకున్నా కూడా పట్టించుకోలేదని..

42 రోజులపాటు ఆ పిటిషన్‌ను అలా వదిలేశారంటే ఎన్నికల కమిషనర్‌కు ఎంత శ్రద్ధ ఉందో అర్ధమవుతుందని వ్యాఖ్యానించింది. ఇక్కడే ఎన్నికల కమిషనర్ తీరుపై ఈ న్యాయస్థానానికి సందేహాలు కలుగుతున్నాయంది.

కోర్టు ఆదేశాల మేరకు నిధులు కేటాయించామని.. పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని చెప్పారు. ఈ వాదనలు తోసిపుచ్చిన న్యాయమూర్తి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదని.. మంజూరైన పోస్టులను భర్త చేయలేదని ఆక్షేపించారు.