Begin typing your search above and press return to search.

ఎంఎల్ఏ పై మండిపడిన హైకోర్టు

By:  Tupaki Desk   |   20 Jan 2022 6:30 AM GMT
ఎంఎల్ఏ పై మండిపడిన హైకోర్టు
X
వైసీపీ పాణ్యం ఎంఎల్ఏ కాటసాని రాంభూపాల్ రెడ్డి వ్యవహార శైలిపై హైకోర్టు మండిపోయింది. ఎంఎల్ఏ వ్యవహారశైలి సరిగా లేదంటు ఆయన తరపు లాయర్ కు ఫుల్లుగా అక్షింతలు వేసింది. టీటీడీ ట్రస్టు బోర్డులో ప్రభుత్వం నియమించిన సభ్యులకు సంబంధించి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. నేరచరిత్ర, రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న వ్యక్తులను బోర్డులో సభ్యులుగా వేయకూడదన్న పిటీషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.

ఇందులో భాగంగానే కొందరు బోర్డు సభ్యులకు, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులిచ్చింది. తమ నోటీసులకు కోర్టులో సమాధానాలు చెప్పాలని అందులో ఆదేశించింది. అయితే కోర్టు నోటీసులను పాణ్యం ఎంఎల్ఏ కాటసాని తీసుకోలేదు. దాంతో అదే విషయాన్ని పిటీషనర్లు కోర్టుకు చెప్పారు. దాంతో బహిరంగంగా పత్రికా ప్రకటన చేయాలని కోర్టు సూచించింది. దీనికి ఎంఎల్ఏ తరపు లాయర్ అభ్యంతరం చెప్పారు. ఇదే విషయమై అటు ఎంఎల్ఏను ఇటు లాయర్ ను హైకోర్టు చీఫ్ జస్టిస్ ఫుల్లుగా క్లాను పీకారు.

ఒక ఎంఎల్ఏ గా ఉండి హైకోర్టు నోటీసులిస్తే ఎందుకు తీసుకోలేదని చీఫ్ జస్టిస్ వేసిన ప్రశ్నకు లాయర్ ఏమీ సమాధానం చెప్పలేకపోయారు. ఒక ప్రజా ప్రతినిధే కోర్టు నోటీసుల విషయంలో ప్రజలకు రాంగ్ సిగ్నల్స్ పంపిస్తే ఎలాగని నిలదీశారు. న్యాయాలయం ఇచ్చిన నోటీసులనే పట్టించుకోని ఎంఎల్ఏ దేవస్థానం ట్రస్టుబోర్డు సభ్యునిగా దేవాలయం పట్ల భక్తిగా ఎలా ఉంటారని ప్రశ్నించింది. ఉద్దేశ్యపూర్వకంగానే ఎంఎల్ఏ తమ నోటీసులను తీసుకోవటానికి నిరాకరించారు కాబట్టి పత్రికా ప్రకటన చేయాలని తాము నిర్ణయించినట్లు చెప్పారు.

జరిగిందానికి ఎంఎల్ఏ తరపున లాయర్ వివరించారు. కొడుకు పెళ్ళి ఉన్న కారణంగా ఎంఎల్ఏ బిజీగా ఉన్నారన్న లాయర్ వివరణను కోర్టు వినిపించుకోలేదు. కోర్టు నోటీసుల తీవ్రతను ఎంఎల్ఏకి ఎందుకు వివరించలేదంటు లాయర్ పై చీఫ్ జస్టిస్ మండిపడ్డారు. మొత్తానికి లాయర్ రిక్వెస్టు మీద పత్రికల్లో ప్రకటన చేయాలన్న కోర్టు ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు చీఫ్ జస్టిస్ ప్రకటించారు. తర్వాత విచారణకు ఎంఎల్ఏ తప్పకుండా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది.