Begin typing your search above and press return to search.

ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

By:  Tupaki Desk   |   13 Sep 2021 12:10 PM GMT
ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
X
గణేష్ నిమజ్జనానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు బాగా సీరియస్ అయ్యింది. హుస్సేన్ సాగర్లోనే గణేష్ నిమజ్జనం చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయడానికి వీల్లేదని హైకోర్టు తీర్పిచ్చేసింది. ఇపుడు తీర్పు అమలు చేయాలా వద్దా అన్న విషయం ప్రభుత్వం ముందుంది. హైకోర్టు తీర్పును అమలు చేయడం కష్టమని కాబట్టి ఈ సారికి నిమజ్జనం చేయడానికి హుస్సేన్ సాగర్లోనే అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్ను కోర్టు కొట్టేసింది.

గణేష్ విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేస్తున్న కారణంగా హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసేటపుడు ఆ నీరంతా కలుషితం అయిపోతోందని పర్యావరణ వేత్తలు ఎప్పటినుండో మొత్తుకుంటున్నారు. గణేష్ విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసేందుకు లేదని కోర్టు ఎప్పటినుండో చెబుతున్నది. అయితే ఎప్పటికప్పుడు ప్రభుత్వమో లేకపోతే గణేష్ ఉత్సవాల కమిటినో లేకపోతే మరొకరో కోర్టుకెళ్ళటం అనుమతులు తెచ్చుకోవటం అందరికీ తెలిసిందే.

ఇదే విషయాన్ని ఈసారి కోర్టు గట్టిగా పట్టుకున్నది. విగ్రహాల నిమజ్జనం కోసం ప్రత్యేకంగా నీటి గుంటలను ఏర్పాటు చేసుకోవాల్సింది అని నాలుగు రోజుల క్రితమే కోర్టు చెప్పింది. అయితే ఇప్పటికప్పుడు ప్రత్యేకంగా నీటిగుంటలను ఏర్పాటు చేసుకోవటం కష్టమనేది ప్రభుత్వ వాదన. హుస్సేన్ సాగర్లో నిమజ్జనం సాధ్యం కాదని చెప్పిన తర్వాత ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి కదా అని కోర్టు నిలదీస్తోంది. దీంతో ఇపుడు నిమజ్జనం అంశం ఇటు హై కోర్టు అటు ప్రభుత్వం మధ్య తెగటం లేదు.

హుస్సేన్ సాగర్లో కాకుండా మరెక్కడ నిమజ్జనం చేయాలనే సమస్యకు పరిష్కారం చూపాల్సిన అవసరం అధికారులదే కానీ తమది కాదని హైకోర్టు స్పష్టంగా చెప్పేసింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ఏమి చేశారో కూడా తమకు చెప్పాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఇపుడు ఏమి చేయాలో ప్రభుత్వానికి అర్ధం కావటంలేదు. ఇదే సమయంలో గణేష్ విగ్రహాన్ని హుస్సేన్ సాగర్లోనే నిమజ్జనం చేస్తామంటూ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన ప్రకటన సమస్యను మరింత జటిలం చేస్తోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.