వాళ్లు బెయిల్‌కు అనర్హులు.. వారి వెనుక పెద్ద తలకాయలు: హైకోర్టు

Sun Dec 05 2021 15:00:01 GMT+0530 (IST)

High Court Sensational Comments

న్యాయవ్యవస్థ హైకోర్టు న్యాయమూర్తుల ప్రతిష్టను దిగజార్చేలా సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టిన ఆరుగురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే అరెస్టయి జైల్లో ఉన్న పలువురు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. బెయిల్ మంజూరు చేసే విషయంలో నేరతీవ్రత నిందితుల పాత్ర కేసు పూర్వాపరాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. కేసు దర్యాప్తు ఇంకా పూర్తికాలేదని... మరికొంతమంది నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందన్న సీబీఐ వాదనలు గుర్తు చేసింది. ఆ నేపథ్యంలో బెయిల్ పిటిషన్లు  కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీ రమేశ్ నవంబరు 30న తీర్పు ఇచ్చారు.ఈ కేసులో అవుతు శ్రీధర్ (ఏ7) రెడ్డి జలగం వెంకటసత్యనారాయణ (ఏ8) దరిశ కిషోర్‌కుమార్ రెడ్డి (ఏ10) గూడ శ్రీధర్‌రెడ్డి (ఏ9) సుస్వరం శ్రీనాథ్ (ఏ12) సుద్దులూరి అజయ్ అమృత్ (ఏ14)లను సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఈ నిందితులకు హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.  న్యాయవ్యవస్థ న్యాయమూర్తుల ప్రతిష్ఠను దిగజార్చేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినవారిని పట్టుకొని శిక్షపడేలా చూడాలని కోరుతూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్  2020 మే 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవ్వడంతో దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని 2020 అక్టోబరు 12న హైకోర్టు ఆదేశించింది.

కేసును బదిలీచేసి ఏడాది గడిస్తేకానీ నిందితులను సీబీఐ పట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీవ్రవ్యాఖ్యలు చేసింది. పిటిషనర్లు ఎంత శక్తిమంతులో అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై పిటిషనర్లు పెట్టిన పోస్టింగ్‌లు పరిశీలిస్తే న్యాయవ్యవస్థపై కుట్ర పన్నినట్లు భా వించాల్సి వస్తుందని పేర్కొంది. ఏప్రిల్ 2020 నుంచి నేటి వరకు న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తూ పెద్ద సంఖ్యలో వ్యక్తులు పోస్టింగ్‌లు పెడుతూనే ఉన్నారని హైకోర్టు స్పష్టం చేసింది. దీని బట్టి పరిశీలిస్తే ఆవ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న పోస్టింగులు న్యాయమూర్తులపై చేస్తున్నవిగా కాకుండా.. న్యాయవ్యవస్థపై దాడిగానే చూడాలని హైకోర్టు పేర్కొంది.

``న్యాయమూర్తులపై ఆరోపణలు చేయడమంటే  కోర్టులను అపఖ్యాతిపాలు చేయడమే. కేసు దర్యాప్తును  సీబీఐకి అప్పగించి న ఏడాది తరువాత నిందితులను ఆ ఏడాది అక్టోబరు 21న అరెస్ట్ చేశారు. దీన్ని బట్టి పిటిషనర్లు చిన్నవారైనప్పటికీ ఈ కుట్ర వెనుక పెద్ద వ్యక్తులు ఉండవచ్చునని అర్థం అవుతుంది' అని న్యాయమూర్తి పేర్కొన్నారు. మొత్తానికి ఈ కేసును హైకోర్టు తీవ్రంగానే పరిగణించినట్టు స్పష్టం అవుతోంది.