Begin typing your search above and press return to search.

స‌ర్కారుకు మెడ‌కు.. సుధాక‌ర్ కేసు.. హైకోర్టు ఫైర్‌..

By:  Tupaki Desk   |   25 Nov 2021 9:33 AM GMT
స‌ర్కారుకు మెడ‌కు.. సుధాక‌ర్ కేసు.. హైకోర్టు ఫైర్‌..
X
డాక్ట‌ర్ సుధాక‌ర్ గుర్తున్నారా? విశాఖ జిల్లాలోని న‌ర్సీప‌ట్నంలో ఉన్న ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో అన‌స్థీషియ న్‌గా ప‌నిచేసిన ఆయ‌న అనూహ్యంగా మీడియాలోకి వ‌చ్చారు. అవి.. క‌రోనా ప్రారంభ రోజులు. ఎక్క‌డిక‌క్క‌డ లాక్‌డౌన్‌తో పాటు క‌రోనా..రోగులు పెరుగుతున్నారు. ఈ స‌య‌మంలో ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్లుగా.. వైద్యులు, పోలీసులు సేవ‌లందిస్తున్నారు. అయితే.. ఎంతో ధైర్యంగా క‌రోనా బారిన ప‌డిన వారికి వైద్యం అందించే త‌మ‌కు నాసిర‌కం మాస్కులు ఇస్తున్నార‌ని.. ఎన్‌-95 మాస్కులు ఇవ్వాల‌ని కోరితే..త‌న‌ను ఉద్యోగంలోంచి తీసేస్తామ‌ని బెదిరిస్తున్నారంటూ.. సుధాక‌ర్ మీడియా ముందుకు వ‌చ్చారు.

అదే స‌మ‌యం లో ఆయ‌న కొన్ని వ్యాఖ్య‌లు కూడా చేశారు. ప్ర‌జ‌ల‌తో సంబంధం లేని కొంద‌రు ఎన్ -95 మాస్కుల‌ను వినియోగిస్తున్నార‌ని.. ప్రాణాల‌కు తెగించి ప‌ని చేసే త‌మ‌కు మాత్రం ఇవ్వ‌డం లేద‌ని ఆయ‌న ఆరోపించారు. ఈ వ్యాఖ్య‌లు చిలికి చిలికి గాలివాన‌గా మార‌డం.. అనంత‌రం.. ఆయ‌న‌ను ఉద్యోగం నుంచితీసేయ‌డం.. కేసులు పెట్ట‌డం తెలిసిందే. అయితే.. ఒక రోజు అనూహ్యంగా.. ఆయ‌న‌ను విశాఖ పోలీసులు న‌డిరోడ్డుపై పెడ రెక్క‌లు విరిచి వెన‌క్కి క‌ట్టి.. అరెస్టు చేయ‌డం.. తీవ్ర‌సంచ‌ల‌నం సృష్టించింది.

ఆయ‌న అరెస్టు.. అనంత‌ర ప‌రిణామాలు తెలిసిందే. ఈ క్రమం లో ఆయ‌న మృతి చెందారు కూడా. దీంతో ఈ కేసు ద‌ర్యాప్తును సీబీఐ కి అప్ప‌గించిన హై కోర్టు.. ఇప్పుడు ఏపీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న‌తీరును తీవ్ర‌ స్థాయిలో దుయ్య‌బ‌ట్టింది. డాక్టర్ సుధాకర్ మృతికి కారకులైన పోలీసులను విచారించేందుకు ఏపీ ప్రభుత్వం సీబీఐకి అనుమతి ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. దీంతో ఈ వ్యవహారంపై హైకోర్టు సీరియస్ అయింది. విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి అనస్తీషియన్ డాక్టర్ సుధాకర్ గతేడాది కరోనా సమయం లో ప్రభుత్వం తగినన్ని మాస్కులు ఇవ్వకపోవడంపై తన అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వం ఆయన్ను టార్గెట్ చేసింది.

ఆయన కు విపక్ష టీడీపీతో సంబంధాలు ఉన్నాయని, సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారని సస్పెండ్ కూడా చేసింది. అనంతరం ఆయన్ను పోలీసులు రోడ్డుపైనే బట్టలూడదీసి లాక్కెళ్లారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. అనంతర పరిణామాల్లో ఆయన పిచ్చోడని ముద్ర వేసి పిచ్చాసుపత్రికి సైతం తరలించారు. చివరికి డాక్టర్ సుధాకర్ చనిపోయారు. అయితే అప్పటికే ఆయన్ను వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేయడంపై హైకోర్టులో పలు కేసులు దాఖలు కావడంతో సీబీఐ దర్యాప్తు జరుగుతోంది. దీనిపై తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆయనను న‌డిరోడ్డుపై పోలీసులు అరెస్టు చేసిన తీరు, త‌ర్వాత ప‌రిమాణాల‌పై దర్యాప్తు జరుపుతున్న సీబీఐకి ఏపీ ప్రభుత్వం సహరించకపోవడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

నేరుగా హైకోర్టు ఆదేశాలతో జరుగుతున్న సీబీఐ దర్యాప్తున‌కు ఏపీ ప్రభుత్వం సహకారం లేకపోవడం విమ‌ర్శ‌ల‌కు దారితీసింది. డాక్టర్ సుధాకర్ కేసులో విశాఖ జిల్లా పోలీసులు అతిగా వ్య‌వ‌హ‌రించార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇదే ప‌రిస్థితి ఆయన మృతికి కారణమైందనే విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీబీఐ కూడా వారిని ప్రశ్నించేందుకు సిద్ధమైంది. అయితే ప్రభుత్వం ఇందుకు అనుమతి నిరాకరించింది. సీబీఐ కోరినా పోలీసుల్ని ప్రశ్నించేందుకు ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో అధికారులు హైకోర్టుకు విన్న‌వించారు. దీంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంత కీలకమైన కేసులో పోలీసుల్ని ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఎందుకివ్వలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ఈ కేసులో నేరస్తుల్ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారా అని ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇలాంటి విషయాల్లో ఎలా వ్యవహరించాలో మాకు తెలుసని కూడా వ్యాఖ్యానించింది. దీంతో హైకోర్టులో ప్రభుత్వం ఇరుకునపడింది. ఇన్నాళ్లూ పోలీసుల పాత్రే లేదని వాదిస్తూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు వారిని సీబీఐ ప్రశ్నించకుండా అడ్డుకోవడం అనుమానాలకు తావిస్తోంది. అయితే, హైకోర్టు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరైన ప్రభుత్వ న్యాయవాది అసలు సీబీఐ ప్రాసిక్యూషన్ కు ప్రభుత్వ అనుమతి అక్కర్లేదని చెప్పేశారు.

దీంతో హై కోర్టు ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అలాగైతే అదే విషయాన్ని మెమో రూపంలో తమ ముందు ఉంచాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ఇప్పుడు ఆ మేరకు మెమో సిద్ధం చేసి కోర్టుకు ఇవ్వబోతోంది. అంటే ప్రభుత్వ అనుమతి లేకుండానే సీబీఐ విశాఖ పోలీసుల్ని ఈ కేసులో ప్రాసిక్యూషన్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.