త్వరలోనే జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు.. మాజీ మంత్రి మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి. ముఖ్యంగా 40 స్థానాలు ఉన్న 'కళ్యాణ కర్ణాటక' ప్రాంతంలో ఈయన సొంత పార్టీ 'కళ్యాణ కర్ణాటక పక్ష' ను ఏర్పాటు చేసుకుని మరీ.. అభ్యర్థులను బరిలో నిలిపారు. తాను స్వయంగాఇక్కడి కొప్పళ జిల్లాలోని కీలకమైన గంగావతి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా బళ్లారి సిటీ నియోజక వర్గం నుంచి తన సతీమణి గాలి లక్ష్మీ అరుణ పోటీ చేయనున్నారు.
ఇదిలావుంటే.. కొన్నాళ్లుగా.. బీజేపీ నేతలు గాలి జనార్దన్రెడ్డిని టార్గెట్ చేస్తూ.. సోషల్ మీడియాలోపై ఆయనకు వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారు. ఆయన దగ్గర భారీగా డబ్బుందని అయినా ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నారని కొందరు వ్యాఖ్యానించారు. మరికొందరు ఆయన ఇక్కడ గెలిచినా బళ్లారికి వెళ్లిపోతారని కాబట్టి ఆయనను గెలిపించ వద్దని కూడా సూచించారు. ఈ పరిణామాలపై నిత్యం గాలి జనార్దన్ రెడ్డి వివరణ ఇస్తున్నారు. ఇక ఆయన ఎప్పుడైనా మరోసారి అరెస్టయ్యే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది.
ఇక ఇప్పుడు తాజాగా గాలి జనార్దన్రెడ్డికి సొంతగా హెలికాప్టర్ ఉందని.. ప్రజలు ఆయనను గెలిపిస్తే.. ఆయన ఆ హెలికాప్టర్లోనే తిరుగుతారని.. ప్రజల సమస్యలు పట్టించుకోరని బీజేపీలోని వ్యతిరేక వర్గం ప్రచారం ముమ్మరం చేసింది. దీంతో గాలి జనార్దన్ రెడ్డి..తనకు ఉన్న హెలికాప్టర్ విషయంపై చెలరేగుతున్న వార్తలకు వివరణ ఇచ్చారు. తనకు సొంతగా హెలికాప్టర్ ఉన్న విషయం వాస్తవమేనని చెప్పారు. అయితే.. ఇది ప్రజలకు సేవ చేసేందుకే తాను కొనుగోలు చేశానని వివరణ ఇచ్చారు.
తాజాగా గంగావతి నియోజక వర్గం ఓటర్లతో మాట్లాడిన జనార్దన్ రెడ్డి తాను ఎందుకు సొంతంగా హెలికాప్టర్ తీసుకున్నాననే విషయంలో క్లారిటీ ఇచ్చారు. ''గతంలో నేను బళ్లారి నుంచి బెంగళూరుకు ఎక్కువ తిరగాల్సి వచ్చింది.
ప్రయాణానికి ఎక్కువ సమయం పట్టేది. సమయం వృధా అవుతోందని భావించి హెలికాప్టర్ కొనుక్కున్నా. అప్పట్లో నేను మంత్రిగా పనిచేసే సమయంలో బళ్లారి-బెంగళూరు మధ్య ఎప్పుడంటే అప్పుడు తిరగవలసి వచ్చింది'' అని అన్నారు.
గంగావతి నియోజకవర్గం నుంచి తనను ఎమ్మెల్యేగా గెలిపించినా తాను ఇక్కడి నుంచి బెంగళూరుకు హెలికాప్టర్ లోనే తిరుగుతానని అయినా కూడా నిత్యం గంగావతి ప్రజలకు అందుబాటులోనే ఉంటానని జనార్దన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అంతే కానీ తాను హోదా చూపించుకోవడానికి బిల్డప్ ఇవ్వడానికి హెలికాప్టర్ కొనలేదని జనార్దన్ రెడ్డి చెప్పారు.అంతేకాదు.. ఎన్నికల సమయానికి ఇలాంటి అనేక ఆరోపణలు.. విష ప్రచారం ఇంకా అనేకం జరుగుతాయని.. వాటిని ప్రజలు నమ్మొద్దని ఆయన వ్యాఖ్యానించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.