Begin typing your search above and press return to search.

ఫ్లోరిడా హాలీవుడ్ బీచ్ లో భారీ కాల్పులు.. 9 మందికి తీవ్ర గాయాలు

By:  Tupaki Desk   |   30 May 2023 11:03 AM GMT
ఫ్లోరిడా హాలీవుడ్ బీచ్ లో భారీ కాల్పులు.. 9 మందికి తీవ్ర గాయాలు
X
ఒకటి తర్వాత ఒకటి గా చోటు చేసుకుంటున్న పరిణామాలు అగ్రరాజ్యం అమెరికా కు పెద్ద ఇబ్బందిగా మారింది. ఇటీవల కాలంలో అమెరికాలో కాల్పుల ఉదంతాలు ఎక్కవ అవుతున్నాయి. గన్ కల్చర్ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళలో.. కాల్పుల కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది. రెండు.. మూడు రోజుల క్రితం కాలిఫోర్నియా లోని లాస్ ఏంజిల్స్ లోజరిగిన కాల్పుల విషాదం నుంచి బయట కు రాక ముందే తాజాగా ఫ్లోరిడా లోని హాలీవుడ్ బీచ్ లో చోటు చేసుకున్న కాల్పుల ఉదంతం షాకింగ్ గా మారింది.

అందరూ చూస్తుండగా.. వాహనంలో వచ్చిన గుర్తుతెలియని వారు.. వాహన కిటీకీల్లో నుంచి బీచ్ లో సేద తీరుతున్న వారి పై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పది మంది బాధితులుగా మారితే.. ఇందులో తొమ్మిది మందికి తీవ్ర గాయాల బారిన పడినట్లుగా అధికారులు చెబుతున్నారు.

వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా లేక్ ల్యాండ్ పోలీసు అధికారులు చెబుతున్నారు. ఒక వాహనంలో వచ్చిన నలుగురు దుండగులు ఈ దారుణానికి తెగబడినట్లుగా చెబుతున్నారు. బీచ్ లో ఉన్న వారు కాల్పుల షాక్ లో ఉండగా.. కాల్పులకు పాల్పడిన వారు పరారయ్యారు. ఉత్తర అయోవా అవెన్యూ.. ఫ్లమ్ స్ట్రీట్ కు సమీపంలో తాజా కాల్పులు జరిగినట్లుగా చెబుతున్నారు.

కాల్పుల్లో గాయపడిన వారంతా 20-35 ఏళ్ల లోపు వారేనని.. వారిలో మహిళలు ఎవరూ లేరన్నారు. అయితే.. కాల్పుల్లో ఒక మైనర్ గాయపడినట్లుగా చెబుతున్నారు. గాయపడిన వారిని దగ్గర్లో ని ఆసుపత్రుల కు తరలించారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 6.41గంటల వేళలో జరిగింది. కాల్పులకు ముందు రెండు గ్రూపుల మధ్య వాగ్వాదం జరిగినట్లుగా కొన్ని మీడియా సంస్థలు రిపోర్టు చేస్తున్నాయి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కాల్పుల కు కారణమైన ఒక అనుమానితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. హాలీవుడ్ మేయర్ జోష్ లెవీ ఈ ఘటన మీద స్పందిస్తూ.. కాల్పుల అనంతరం బాధితుల కు సాయం చేసిన పోలీసుల కు.. వైద్యుల కు ధన్యవాదాలు తెలిపారు. దుండగుల కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపులు చేపట్టారు.