నా భర్త సైకో.. అందుకే చచ్చిపోతున్నా.. హెడ్ కానిస్టేబుల్ భార్య!

Tue Nov 29 2022 21:00:01 GMT+0530 (India Standard Time)

Head Conistable Wife Suicide

''నన్ను నానా చిత్ర హింసలు పెట్టాడు. భార్యనని కూడా చూడకుండా అర్ధరాత్రి పూట గుంజీలు తీయించాడు. ఇంటికి వస్తూనే ఒళ్లంతా తడిమేవాడు. తడిగా ఉందని.. ఇప్పటి వరకు ఎవరితో ఉన్నావని నిలదీసేవాడు. ఈ హింసలు భరించలేక చచ్చిపోతున్నా''- ఇదీ.. ప్రజలకు సేవ చేసే ఒక హెడ్ కానిస్టేబుల్.. భార్య తన సూసైడ్ నోట్‌లో రాసుకున్న ఆవేదన.ప్రాణప్రదంగా చూసుకోవాల్సిన భర్త అనుమానిస్తూ నిత్యం వేధింపులకు గురిచేస్తుండటంతో ఆ ఇల్లాలు భరించలేకపోయింది. అమ్మానాన్నలకు కూడా భారం కాకూడదని భావించి బలవన్మరణానికి పాల్పడింది. తల్లిదండ్రులు పిల్లలను క్షమించమని కోరుతూ.. తాను పడిన వేదనంతా ఓ లేఖలో రాసి ఆత్మహత్య చేసుకుంది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా నస్పూర్ నాగార్జునకాలనీలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

చెన్నూరు మండలం సుద్దాల గ్రామానికి చెందిన ఆకుదారి కిష్టయ్యకు నస్పూర్‌కు చెందిన వనిత (35)తో 15ఏళ్ల క్రితం వివాహమైంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కిష్టయ్య కుటుంబంతో నాగార్జునకాలనీ సింగరేణి క్వార్టర్‌లో అద్దెకు ఉంటున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు కుమారుడు ఉన్నారు.

అనుమానంతో అతను వనితను తరచూ తీవ్రంగా వేధిస్తుండటంతో ఆమె భరించలేకపోయింది. ఇంటికి వస్తూనే గలీజు మాటలు మాట్లాడేవాడు. ఈ క్రమంలో విసిగిపోయిన  ఆ ఇల్లాలు సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన భర్తకు ఆమె ఉరేసుకొని కనిపించడంతో ఇరుగుపొరుగు వారికి చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు.

విషయం తెలుసుకున్న వనిత తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. విగతజీవిగా ఉన్న కుమార్తెను చూసి గుండెలవిసేలా రోదించారు. స్థానికులు సమాచారం అందించడంతో ఎస్సై రవికుమార్ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి లింగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

తనను భర్త మానసిక క్షోభకు గురిచేసిన తీరుపై తల్లిదండ్రులు పిల్లలను ఉద్దేశించి వనిత రాసిన లేఖ కంటతడి పెట్టిస్తోంది. ''నా భర్త కిష్టయ్య పెద్ద సైకో.. ఎప్పుడు ప్రేమగా చూడలేదు. ఇంట్లోనుంచి బయటకు వెళ్తే అనుమానించేవాడు. అతని వేధింపులతో మానసిక క్షోభకు గురయ్యాను. అందుకే చనిపోతున్నా..'' అని పేర్కొంది. తన పిల్లలను భర్తకు అప్పగించవద్దని వారిని జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిదండ్రులను లేఖలో కోరింది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.