Begin typing your search above and press return to search.

ఆయన పట్టుదల ముందు అంగవైకల్యం ఓడిపోయింది.. దేశంలోనే రికార్డు!

By:  Tupaki Desk   |   5 Dec 2021 1:30 PM GMT
ఆయన పట్టుదల ముందు అంగవైకల్యం ఓడిపోయింది.. దేశంలోనే రికార్డు!
X
పుట్టుకతోనే మరుగుజ్జుగా పుట్టాడు. శరీర నిర్మాణంలో కాస్త తేడాలున్నా కూడా నిండైన ఆత్మవిశ్వాసంతో పెరిగాడు. ఇంట్లోనే కాకుండా పాఠశాలు, కళాశాల, తోటి వారు హేళనగా చూసినా నవ్వుతూ సమాధానం చెప్పారు. ఎన్నో అవమానాలు, మరెన్నో అవహేళనలు, చిన్నచూపులు ఆయన పట్టుదలను రెట్టింపు చేశాయి. పైగా అనుకున్నవి సాధించే దిశగా ప్రోత్సహించాయి. అందుకే దేశంలోనే తొలి వ్యక్తిగా రికార్డులను సొంతం చేసుకున్నారు. ఆయనే తెలంగాణకు చెందిన మూడు అడుగుల ఎత్తు ఉన్న శివలాల్.

గంగాధర్‌, రాజమ్మ దంపతులకు తొలి సంతానం శివలాల్. ఈయనకు ఇద్దరు తమ్ముళ్లు. వాళ్లు సాధారణంగానే ఉన్నారు. ఇక చిన్నతనం నుంచే శివలాల్ చాలా అవమానాలకు గురయ్యేవారు. మరుగుజ్జుగా పుట్టడం వల్ల ఇంట్లోనివారు, బంధువులు, స్నేహితులు అందరూ హేళన చేసేవారు. అయినా తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా చదువుల్లో రాణించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇంటర్ వరకు పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ కు వచ్చి... డిగ్రీ పూర్తి చేశారు.

హైదరాబాద్ కు వచ్చిన సమయంలో ప్రయాణం చేయాలంటే ప్రజా రవాణాపైనే ఆధారాపడాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో చాలామంది నుంచి ఎన్నో చిన్నచూపులు ఎదుర్కొన్నారు. అందుకే మరుగుజ్జులెవ్వరూ ఆలోచించని రీతిలో ఈయన ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణం కోసం ఇతరుల మీద ఆధారపడకుండా డ్రైవింగ్ నేర్చుకోవాలని సంకల్పించారు. అయితే అందులో చాలా సవాళ్లు ఎదుర్కొన్నారు. డ్రైవింగ్ కోసం అమెరికా వెళ్లారు. తనకు అనుకూలంగా ఉండే కారును డిజైన్ చేయించుకున్నారు. ఓ ఇంజినీర్ సాయంతో క్లచ్, బ్రేక్ వంటి వాటిని రీమోడలింగ్ చేయించుకున్నారు. తాను డ్రైవింగ్ చేసేందుకు వీలుగా ఆ కారును రూపొందించుకున్నట్లు శివలాల్ తెలిపారు.

ఈ ఏడాది జవనరి నుంచి డ్రైవింగ్ శిక్షణ తీసుకున్నట్లు శివలాల్ వెల్లడించారు. ఆరు నెలల్లో పూర్తి తర్ఫీదు పొందారు. ఈ సమయంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయని... వాటిని ధైర్యంతో అధిగమించానని చెప్పారు. అయితే డ్రైవింగ్ వచ్చినంతమాత్రానా లైసెన్సు రావడం అంత ఈజీ కాదు కదా. డ్రైవింగ్ లైసెన్సు జారీ చేయడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అయినా వాటిపై పోరాటం చేశారు. మార్చి 6న లెర్నింగ్ లైసెన్సును పొందారు. అనంతరం ఆయన కృషి ఫలించింది. ఆగస్టు6న శాశ్వత డ్రైవింగ్ లైసెన్సు వచ్చింది. దేశంలో ఇంతతక్కువ ఎత్తు ఉన్నవారు శాశ్వత డ్రైవింగ్ లైసెన్సు పొందడం ఇదే తొలిసారి. మరుగుజ్జుల్లో మూడు అడుగుల ఎత్తు ఉండి.. లైసెన్సు పొందిన వారిలో శివలాల్ తొలివ్యక్తి. అతితక్కువ వయసులో డ్రైవింగ్ లైసెన్సు పొందినందుకు గాను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నారు.

శివలాల్ ప్రస్తుతం ఆయన భార్యకు డ్రైవింగ్ నేర్పిస్తున్నారు. తనలాంటి వారికి డ్రైవింగ్ లో శిక్షణ ఇవ్వడానికి ఓ ప్రత్యేక డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. తనలాంటి వారు ప్రయాణాల కోసం ఇతరుల మీద ఆధారపడకుండా ఉండేందుకు ఈ ఆలోచన వచ్చిందని తెలిపారు. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా గేర్లు లేని సెల్ఫ్ ప్రొపెల్డ్ వెహికిల్స్ కు అనుమతి ఇచ్చింది.

హైదరాబాద్ లో నివాసం ఉంటున్న 42 ఏవ్వ శివలాల్ మరుగుజ్జు. అయితేనేం తనదైన సంకల్పంతో అనుకున్నది సాధించారు. డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి మరుగుజ్జుగా పలు రికార్డులను దక్కించుకున్నారు. ఎత్తు తక్కువైనా... పట్టుదల తక్కువ కాదని నిరూపిస్తూ... అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.