జగన్‌కు ప్రజాదరణ పెరిగిందా...లేక ఏం జరిగింది....?

Thu Sep 23 2021 23:00:01 GMT+0530 (IST)

Has the popularity of Jagan increased

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కూడా ఇంకా పూర్తికాలేదు. అయితే.. వరుసగా వచ్చిన స్థానిక పరిషత్ కార్పొరేషన్ మునిసిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ విజయం దక్కించుకుంది. అదేసమయం లో తిరుపతి పార్లమెంటు స్థానంలోనూ వైసీపీ విజయం సాధించింది. దీనిని వైసీపీ నాయకులు.. జగన్ కు ఉన్న ప్రజాదరణ వల్లే ఇలా జరిగిందని చెబుతున్నారు. ఆయన ప్రవేశ పెట్టిన పథకాలు.. అందిస్తున్న సంక్షేమ ఫలాల కారణంగా.. ప్రజలు జగన్‌కు జై కొడుతున్నారంటూ.. పెద్ద ఎత్తున ఊదరగొడుతున్నారు. మరి ఇది నిజమేనా?  లేక జిమ్మిక్కా? అనేది చర్చకు దారితీస్తోంది.గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటే 17.66 శాతం అధికంగా ఇప్పుడు జగన్‌కు ప్రజాదరణ పెరిగిందని.. వైసీపీ నేతలు చెబుతున్నారు.  ఈ రెండేళ్ల పాలనలో 67.61 శాతం మంది ప్రజల ఆదరణను చూరగొన్నట్లు చెబుతున్నారు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా రికార్డు స్థాయిలో దాదాపు 49.9 శాతం ఓట్లను దక్కించుకుని వైసీపీ అధికారంలోకి వచ్చిన విషయం వాస్తవమే. అయితే.. అది సెంటిమెం టుతో ముడిపడిందని.. టీడీపీ నేతలు చెబుతున్నారు. జగన్ ఆయన కుటుంబం వెంటే ఉందని.. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని అభ్యర్థించిందని.. అందుకే ఆయనకు ప్రజలు విజయం అందించారని చెబుతున్నారు.

ఇక జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండేళ్లకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన పరిషత్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లతో కలిపి గ్రామీణ ప్రాంతానికి చెందిన 13053 282  మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని మెజారిటీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో 67.61 శాతం ఓట్లను అధికార పార్టీపై పోటీ చేసిన అభ్యర్ధులు దక్కిం చుకున్నారు. టీడీపీ గుర్తు మీద పోటీ చేసిన అభ్యర్ధులకు 22.79 శాతం ఓట్లు దక్కాయి. మొత్తం ఓటు హక్కు వినియోగించుకున్న 1.30 కోట్ల మందికిపైగా ఓటర్లలో వైసీపీ గుర్తు మీద పోటీ చేసిన అభ్యర్ధులకు 8825343 మంది ఓట్లు వేశారు. టీడీపీ అభ్యర్ధులకు 2975238 మంది ఓటు వేశారు.

దీనిని చూపించే.. వైసీపీ అధిష్టానం.. నాయకులు కూడా తమకు ప్రజాదరణ పెరిగిందని చెబుతున్నారు. కానీ టీడీపీ మాత్రం.. మరో భాష్యం చెబుతోంది. వైసీపీ బలవంతపు ఏకగ్రీవాలు చేసుకుందని.. చెబుతు న్నారు. అంతేకాదు.. పోనీ.. ఏకగ్రీవాల విషయాన్ని పక్కన పెట్టినా.. ఓట్లు వేసే సమయంలో వలంటీర్లతో ఓటర్లను బెదిరించారని.. వైసీపీ అభ్యర్థులను గెలిపించకపోతే.. పింఛన్లు కట్ చేస్తామని.. జగనన్న ఇళ్లను వెనక్కి తీసుకుంటామని.. ప్రభుత్వ పథకాల నుంచి తప్పిస్తామని.. చెప్పారని.. దీంతో విధిలేని పరిస్థితిలోనే ప్రజలు వైసీపీకి ఓట్లేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు జగన్ వచ్చిన ఓట్లకు ప్రాధాన్యం లేకుండా పోయిందని అంటున్నారు విశ్లేషకులు. మరి దీనిపై వైసీపీ నాయకులు ఎలా మాట్లాడతారో చూడాలి.