నిమ్మగడ్డపై విశ్వాసం లేదని ప్రభుత్వం తేల్చేసిందా ?

Thu Oct 29 2020 08:45:41 GMT+0530 (IST)

Has the government decided not to trust Nimmagadda?

స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై విశ్వాసం లేదని ప్రభుత్వం తేల్చేసిందా ? మంత్రి బొత్సా సత్యనారాయణ అవంతి శ్రీనివాస్ తాజాగా చేసిన ఆరోపణలు చూసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోయాయి. ఇద్దరు మంత్రులు మీడియా సమావేశంలోనే నిమ్మగడ్డపై నమ్మకం కోల్పోయినట్లు మాట్లాడారంటే దీన్ని ప్రభుత్వ ఆలోచనగానే చూడాల్సుంటుంది.మంత్రులిద్దరు మాట్లాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులకు వెళ్ళి టీడీపీ నేతలను హోటళ్ళల్లో కలుస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ప్రభుత్వం ఎలా విశ్వసిస్తుందంటూ ప్రశ్నించారు. స్ధానిక సంస్ధల ఎన్నికలను అర్ధాంతరంగా వాయిదా వేయాలని నిమ్మగడ్డ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం వల్ల రాష్ట్రానికి రావాల్సిన రూ. 3200 కోట్ల ప్రజాధనం వృధాగా పో యిందన్నారు. ప్రభుత్వాన్ని కానీ రాజకీయ పార్టీల అభిప్రాయాలను కానీ తీసుకోకుండానే మొన్నటి మార్చిలో  ఎన్నికల ప్రక్రియను ఎలా వాయిదా వేశారని మంత్రులు వేసిన  ప్రశ్నకు  నిమ్మగడ్డకు ఏమని సమాధానం చెబుతారో ?

కేవలం 20 కరోనా వైరస్ కేసులున్నపుడే ఎన్నికల వాయిదా వేసిన నిమ్మగడ్డ ఇపుడు రోజుకు వేలల్లో కేసులు రిజస్టర్ అవుతున్నపుడు ఎన్నికలను ఎలా నిర్వహించాలని అనుకుంటున్నారో ముందు చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. మంత్రులే కాదు ఇదే ప్రశ్నను చాలామంది నిమ్మగడ్డకు సంధిస్తున్నారు. మరి ఈ ప్రశ్నకు కమీషనర్ ఏమని సమాధానం చెబుతారో చూడాలి.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అయినా మంత్రులయినా చెబుతున్నదేమంటే ఇప్పట్లో ఎన్నికలను నిర్వహించలేమనే. రోజుకు వేలాది కేసులు నమోదవుతున్న కారణంగా ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు లేవని ప్రభుత్వం మరోసారి నిమ్మగడ్డకు స్పష్టం చేసేసింది. నీలం అభిప్రాయాలతో నిమ్మగడ్డ ఏకీభవిస్తునే మళ్ళీ ఎన్నికలు జరగకుండా ఆపటం కష్టమని చెప్పటం గమనార్హం. అంటే నిమ్మగడ్డ చెప్పిన మాట విన్నతర్వాత ప్రభుత్వంతో ఘర్షణకే సిద్ధపడుతున్న విషయంలో క్లారిటి వచ్చేసింది.