Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు దేవుడి మీద ఎంత నమ్మకమో హరీశ్ చెప్పాల్సి వచ్చిందే?

By:  Tupaki Desk   |   19 Feb 2023 4:35 PM IST
కేసీఆర్ కు దేవుడి మీద ఎంత నమ్మకమో హరీశ్ చెప్పాల్సి వచ్చిందే?
X
పాపం హరీశ్ అన్నట్లుగా మారింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్వయాన మేనల్లుడు.. బీఆర్ఎస్ పార్టీకి అసలుసిసలైన వీర విదేయుడిగా తనను తాను నిరూపించుకునేందుకు.. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఈగ వాలకుండా చూసుకోవటానికి హరీశ్ పడే అవస్థలు అన్ని ఇన్ని కావు. రాజకీయ ప్రత్యర్థులు చేసే విమర్శలకు ఆయన తరచూ సమాధానం ఇస్తుంటారు.

తన మేనమామ మీద ప్రత్యర్థులు వేసే బురదను ఆయన కడిగే ప్రయత్నం చేస్తుంటారు. కానీ.. ఆయన ఎంతలా ప్రయత్నించిన ఏవో ప్రశ్నలు వెంటాడుతూనే ఉంటాయి. తాజాగా అలాంటి పరిస్థితే నెలకొంది.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అదే పనిగా సీఎం కేసీఆర్ మీద చేసే ఘాటు వ్యాఖ్యలు కలకలాన్ని రేపుతుంటాయి. ఆయన హిందూ ద్రోహిగా అభివర్ణించేందుకు ఉండే ఏ చిన్న అవకాశాన్ని బండి వదిలిపెట్టారు. అలా ఆయన చేసే వ్యాఖ్యల్ని ఖండిస్తూ.. సీఎం కేసీఆర్ కమిట్ మెంట్ గురించి అందరికి తెలిసేలా ప్రయత్నిస్తుంటారు హరీశ్. తాజాగా అలాంటి సీనే మరొకటి ఎదురైంది.

కేసీఆర్ కు హిందు మతం మీదా.. దేవుళ్ల మీద ఎంతటి గురి ఉందన్న విషయాన్ని తెలియజేసేందుకు తాజాగా హరీశ్ పడిన కసరత్తు అంతా ఇంతా కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు దేవుడిపై పూర్తి నమ్మకం.. విశ్వాసం ఉందని.. అందుకు తగ్గట్లే పాలన సాగిస్తున్నట్లుగా చెప్పారు. ఈ కారణంతోనే పలు ప్రాజెక్టులకు దేవుడి పేర్లు పెట్టినట్లుగా చెప్పారు.
అంతేకాదు.. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని భూలోక్ వైకుంఠంగా తీర్చిదిద్దిన వైనాన్ని గుర్తు చేశారు.

కొత్త జిల్లాలు.. సాగునీటి ప్రాజెక్టులకు దేవుడి పేర్లు పెట్టిన వైనాన్ని గుర్తు చేస్తూ.. సీఎం సార్ కున్న కమిట్ మెంట్ ఏ పాటిదన్న విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేశారు. ఇదంతా చూసినప్పుడు మంత్రి హరీశ్ పడుతున్ పాట్లు కనిపిస్తాయి.

అదే సమయంలో పబ్లిక్ మీటింగ్ లో హిందుగాళ్లు.. బొందుగాళ్లు అంటూ చేసిన వ్యాఖ్యల మాటేమిటి? అన్న ప్రశ్న పలువురి నోట వస్తోంది. మేనమామను కవర్ చేయటం హరీశ్ వరకు బాగానే ఉన్నా.. మరి ఇలాంటి ప్రశ్నలకు ఆయన ఏమని బదులిస్తారు? అన్నది అసలు ప్రశ్నగా మారిందని చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.