Begin typing your search above and press return to search.

6 గంటల వేళలో మారుమూల గ్రామాన ఉన్న లచ్చన్న అనే కుర్రాడికి హరీశ్ ఫోన్

By:  Tupaki Desk   |   18 Oct 2020 8:10 AM GMT
6 గంటల వేళలో మారుమూల గ్రామాన ఉన్న లచ్చన్న అనే కుర్రాడికి హరీశ్ ఫోన్
X
మంత్రి హరీశ్ రావు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. లచ్చన్న పేరు విన్నారా? ఎవరికి తెలీదు. ఆ మాటకు వస్తే.. మంత్రి హరీశ్ కు కూడా తెలీదు. కానీ.. ఆ పాతికేళ్ల కుర్రాడికి ఉదయాన్నే పని గట్టుకొని మరీ మంత్రి హరీశ్ ఫోన్ చేశారెందుకు? అతగాడేమైనా అద్భుత విజయాన్ని సాధించారా? అంటే అది లేదు. కాన.. ఆ కుర్రాడికి చేసిన ఫోన్ కాల్ ఇప్పుడు సంచలనంగా మారింది. టీఆర్ఎస్ పార్టీలో చాలామందికి ఇవ్వాల్సిన సంకేతాల్ని.. సందేశాన్ని ఇచ్చినట్లైంది. ఇంతకూ ఏం జరిగిందంటే?

వచ్చే నెల మూడున జరిగే దుబ్బాక ఉప ఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. మిగిలిన వారితో పోలిస్తే.. అధికార టీఆర్ఎస్ టాప్ ప్రయారీటీ తీసుకొంది. తన వ్యక్తిగత బాధ్యతగా దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపును హరీశ్ రావు భావిస్తున్నారు. గెలుపు మీద సందేహం లేనట్లుగా ప్రచారం జరుగుతున్నా.. తాజాగా బయటకు వచ్చిన ఉదంతాన్ని చూసినప్పుడు.. ఎన్నికల వేళ ఎంత అప్రమత్తంగా ఉండాలన్న విషయం చెప్పకనే చెప్పేస్తుంది. భారీ మెజార్టీతో తెలంగాణలో తమకు తిరుగులేదన్న సందేశాన్ని ఇవ్వాలన్న మంత్రి హరీశ్ ఆలోచనగా చెబుతున్నారు.

ఈ క్రమంలో దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని ప్రతి మారుమూల గ్రామంలో ఏం జరుగుతుంది? అధికార పార్టీ ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా పని చేస్తున్న వారెవరు? అన్న విషయాన్ని భూతద్దంలో వేసి మరీ వెతుకుతున్నారు. టీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు ఇబ్బంది కలిగించే వారు ఎంత చిన్నవారు అయినప్పటికి.. తానే నేరుగా వారితో మాట్లాడుతున్నారు. అనునయంగా మాట్లాడుతూ.. వారేం చేస్తున్న విషయాన్ని చెప్పటమే కాదు.. సహకరించాల్సిందిగా కోరుతున్నారు. మీరేం చేస్తున్నారో అన్ని తెలుసన్న విషయాన్ని చెప్పకనే చెప్పేస్తున్నారు.

దుబ్బాక నియోజకవర్గంలోని ఒక మారుమూల గ్రామంలో ఉండే లచ్చన్న అనే పాతికేళ్ల యువకుడు టీఆర్ఎస్ పార్టీనే అయినప్పటికీ కాంగ్రెస్ కు అనుకూలంగా పని చేస్తున్నాడు. అతడి కారణంగా కాస్త ప్రభావం ఉంటుందన్న నివేదిక అందిన వెంటనే.. ఉదయం ఆరు గంటలకు తానే స్వయంగా ఆ కుర్రాడికి ఫోన్ చేశారు. ఒక మారుమూల గ్రామంలో ఉండేఒక కుర్రాడి సమాచారం.. అతడు చేస్తున్న పని హరీశ్ వరకు ఎలా వెళ్లిందన్నది.. ఆ కుర్రాడు ఎంత బుర్ర బద్దలు కొట్టుకుంటున్నా అర్థం కాని పరిస్థితి. తాము చేసే ప్రతి పని మంత్రి హరీశ్ కు ఎప్పటికప్పుడు తెలుస్తాయన్న సందేశాన్ని తాజా ఫోన్ కాల్ తో హరీశ్ రావు చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.

మంత్రి హరీశ్.. సదరు యువకుడి మధ్య సంభాషణ ఎలా సాగుతుందన్నది చూస్తే..

హరీశ్ రావు: తమ్మీ.. నేను హరీశ్ రావును మాట్లాడుతున్నా.

లచ్చన్న: అన్నన్నా. నేను లచ్చయ్య మాట్లాడుతున్నా.

హరీశ్‌రావు: (నవ్వుతూ) తెలుసు తమ్మీ.. బాగున్నవానే !!

లచ్చన్న: బాగున్నా.. ఇంత పొద్దుగాల ఫోన్‌ జేసిండ్లు !?

హరీశ్‌రావు: ఇగ జరైతే ప్రచారంలో పోవుడే గదనే.. గందుకే గిప్పుడు జేసిన.. ఓ ముచ్చట మాట్లాడేదుండె..

లచ్చన్న: చెప్పన్నా.. చెప్పన్నా..

హరీశ్‌రావు: మన పార్టీలో(టీఆర్‌ఎస్‌) మంచిగనే ఉన్నవ్‌ గదనే.. గా కాంగ్రెస్‌ నాయకునితోని నీకేం పనే? ఆయనతో ఎందుకు తిరుగుతున్నవ్‌? నేను లేనానే నీకు..?

లచ్చన్న: లేదన్న.. నేను కాంగ్రెసోళ్లతో తిరగలె..

హరీశ్‌రావు: గట్ల జూటా మాటలు జెప్పకు లచ్చన్న. నిన్న మీ ఊళ్లె హోటల్‌ కాడికి ఇద్దరు కలిసిరాలె.. మీరు ఏం మాట్లాడుకున్నరో జెప్పనా?

లచ్చన్న: ఎందుకులె అన్నా.. ఎందుకులే..(నసిగిండు)

హరీశ్‌రావు: గిప్పుడే గదనే మనం గట్టిగ పనిజేసేది. కాంగ్రెసోళ్లతో కొట్లాడుకుంట..ఆ పార్టీల ఉన్నోళ్లతోనే తిరుగుతెట్లనే. మన పార్టీల ఉన్నోళ్లు ఏమనుకుంటరు? నలుగురికి జెప్పేటోడివి నువ్వే ఇట్ల జేస్తే యెట్లనే?

లచ్చన్న: తప్పైందన్నా.. తప్పైంది. ఇంకోసారి జరగకుంట సూసుకుంటన్నా..

హరీశ్‌రావు: సరే తమ్మీ..ఈ ఎన్నికలైనంక ఒకసారి సిద్ధిపేటకు వచ్చి కలువు..

లచ్చన్న: సరే అన్నా..సరే అన్నా..