Begin typing your search above and press return to search.

అవార్డులు వస్తే కరెక్టు.. కాళేశ్వరం మీద చెబితే అబద్ధమా? అదేంటి హరీశ్?

By:  Tupaki Desk   |   18 March 2023 9:48 AM GMT
అవార్డులు వస్తే కరెక్టు.. కాళేశ్వరం మీద చెబితే అబద్ధమా? అదేంటి హరీశ్?
X
అధికారికంగా వెల్లడించే సమాచారంలో తప్పులు చేసేంత బరితెగింపు అయితే మోడీ సర్కారుకు లేదనే చెప్పాలి. ఆ మాటకు వస్తే.. కేంద్రంలో ఉండే ప్రభుత్వం ఏదైనా సరే.. అంతటి దరిద్రపుగొట్టు తీరును ప్రదర్శించే పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతానికి లేదనే చెప్పాలి. రాజకీయం రంగు పూర్తిగా మారిపోయిన వేళ.. ఇప్పుడు చాలా విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. తమకు అనుకూలంగా ఉన్నది ఏదైనా సరే తమ గొప్పగా చాటుకోవటం.. ఏ చిన్న తేడా వచ్చినా.. దానిపై విరుచుకుపడటం ఇప్పుడో అలవాటుగా మారింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మాటలే నిదర్శనమని చెబుతున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా విషయానికి సంబంధించి తమకు ఎలాంటి కమ్యూనికేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందలేదంటూ షాకింగ్ వ్యాఖ్యను కేంద్రంలోని మోడీ సర్కారు తాజాగా పార్లమెంటులో ప్రకటించటం తెలిసిందే. దీనిపై మంత్రి హరీశ్ రావు రియాక్టు అయ్యారు. ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలంటూ పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోని కేంద్రం.. ఇప్పుడు వాస్తవాల్ని దాచి పెట్టి మాట్లాడుతుందని పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపలేదన్న కేంద్ర గిరిజన, జలశక్తి శాఖ సహాయక మంత్రి విశ్వేశ్వర్ తుడు చేసిన వ్యాఖ్యలపై హరీశ్ మండిపడ్డారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు అవాస్తవని.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నీటిపారుదల శాఖ మంత్రికి, ప్రధానమంత్రికి నేరుగా వినతిపత్రాలు అందించినట్లుగా పేర్కొన్నారు. అయితే.. హరీశ్ వ్యాఖ్యలపై కౌంటర్ వినిపిస్తోంది.

కేంద్రం ఇచ్చే అవార్డులు.. పురస్కారాల్ని గొప్పగా కీర్తించుకోవటమే కాదు.. తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఇచ్చామన్న భావన వ్యక్తమయ్యేలా కేంద్రంపై సెటైర్లు వేసే వేళ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రమంత్రి ఎందుకు అబద్ధాలు చెబుతారు? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. డిమాండ్ చేయటం ఒక ఎత్తు.. ప్రొసిజర్ ప్రకారం పంపటం మరో ఎత్తు అని గుర్తు చేస్తున్నారు. ఒకవేళ.. నిజంగానే కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినతులు ఇవ్వలేదన్న కేంద్ర మంత్రి మాటల్లో తప్పు ఉంటే.. ఈపాటికి కేంద్రానికి సమర్పించిన వినతిపత్రాల నకళ్లు.. వాటి తేదీలకు సంబంధించిన ప్రకటనను విడుదల చేసి ఉంటే సరిపోయేది కదా? అన్న సందేహం వ్యక్తమవుతోంది.

కేంద్రమంత్రి అబద్ధం చెబితే.. దాన్ని కడిగిపారేసేలా ఆధారాల్ని.. వివరాల్ని సోషల్ మీడియాలో పోస్టు చేసేస్తే.. సరిపోయేదని.. కానీ అలాంటివేమీ చేయకుండా కేంద్రంలోని మోడీ సర్కారుపై ఉత్త మాటలతో విమర్శలు చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు. వినతిపత్రాల విషయంలోనే తప్పులు చెప్పే అలవాటు మోడీ సర్కారుకు ఉంటే.. తెలంగాణ రాష్ట్రానికి ఇన్నేసి అవార్డులు ఇప్పటివరకు వచ్చేవా? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వినతి ఇతర శాఖలకు ఇచ్చి ఉండొచ్చుకానీ.. గిరిజన శాఖకు ఇచ్చి ఉండకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు సరైన అనుమతులే తీసుకోలేదన్న ఆరోపణలు ఉండటాన్ని గుర్తు చేస్తున్నారు. ఇవన్నీ వదిలేసి.. కేంద్రం అబద్ధాలు చెబుతుందని విరుచుకుపడటంలో అర్థం లేదనే మాట వినిపిస్తోంది. కాస్తంత సరిగా హోంవర్కు చేసి తిడితే హరీశ్ స్థాయికి తగ్గట్లు ఉంటుందన్న మాట కమలనాథుల నోటి నుంచి రావటం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.