Begin typing your search above and press return to search.

హ్యాకింగ్ నిజం.. ఐదుసార్లు ఫోన్ మార్చా: పీకే

By:  Tupaki Desk   |   20 July 2021 7:15 AM GMT
హ్యాకింగ్ నిజం.. ఐదుసార్లు ఫోన్ మార్చా: పీకే
X
దేశంలో ‘ఫోన్ హ్యాకింగ్’ ప్రకంపనలు సృష్టిస్తోంది. మొబైల్ ఫోన్‌ల ద్వారా దేశంలోని జర్నలిస్టులు, రాజకీయనేతలు, ప్రముఖులపై నిఘా పెట్టారని తెలిసింది. ఇజ్రాయెల్ స్పైవేర్ 'పెగసాస్' లక్ష్యంగా చేసుకొని దేశంలోని వందలాది మంది ప్రముఖులను ఫోన్లు ట్యాప్ చేశారని.. అందులో నా ఫోన్ కూడా ఉందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన ఆరోపణలు చేశారు. తన హ్యాండ్‌సెట్‌ను చాలాసార్లు మార్చినప్పటికీ తన ఫోన్ "ఇప్పటికీ హ్యాక్ చేయబడుతోంది" అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "నా ఫోన్ కూడా హ్యాక్ అవుతోంది. అది కూడా 2017 నుండి 2021 వరకు హ్యాకింగ్‌ అయ్యిందని గ్రహించలేదు. సాక్ష్యాలు బయటపడడంతో  నేను ఐదుసార్లు నా హ్యాండ్‌సెట్‌ను మార్చాను. అయినప్పటికీ హ్యాకింగ్ కొనసాగుతోంది" అని ప్రశాంత్ కిషోర్ తాజాగా జాతీయ న్యూస్ చానెల్ ఎన్డీటీవీతో చెప్పారు.

అంతర్జాతీయ మీడియా ‘ది వైర్’ నివేదికలో ఉదహరించిన ఫోరెన్సిక్ విశ్లేషణ ప్రకారం..  ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఫోన్ జూలై 14 నాటికి హ్యాక్ చేయబడిందని అంటున్నారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అధికారంలోకి తెచ్చిన బీజేపీ 2014 ప్రచార వ్యూహంలో ప్రశాంత్ కిషోర్ ప్రముఖ పాత్ర పోషించారు. అప్పటి నుంచి అతను అనేక రకాల రాజకీయ పార్టీలతో కలిసి పనిచేశాడు. ఎక్కువగా బిజెపికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను గెలిపించాడు. దీంతో వ్యూహాలు తెలుసుకునేందుకు ఆయన ఫోన్ ను కూడా హ్యాక్ చేసినట్టు తెలిసింది.

తమిళనాడులోని డీఎంకే- తృణమూల్‌తో పాటు పంజాబ్‌లోని కాంగ్రెస్‌తో సహా పలు ప్రతిపక్ష పార్టీలకు కీలక రాజకీయ సలహాదారుగా.. వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ కు పేరుంది. ప్రస్తుత జాతీయ రాజకీయాలపై ప్రశాంత్ కిషోర్ దృష్టిసారించాడు. అతడి ఏజెన్సీ కూడా  దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రభుత్వ రాజకీయ ప్రత్యర్థులకు అండగా పనిచేస్తోంది..

 ప్రస్తుతం ప్రశాంత్ వాడుతున్న ఫోన్ ఫోరెన్సిక్ పరీక్షలో హ్యాకింగ్ కు గురైనట్టు ఆయన తెలిపాడు. 2019 సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల ముందు  2018 లో పెగాసస్ దాడి చేయడానికి  విఫల ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఊహాగానాలు వెలువడుతున్న సమయంలో కిషోర్ - అతని డిమాండ్ ఉన్న ఎన్నికల కన్సల్టెన్సీ సంస్థ ఐ-పాక్ ఎన్నికలలో పెద్ద ఎత్తున ప్రాంతీయ పార్టీల కోసం పనిచేస్తూ గెలిపిస్తూ వచ్చింది.

కిషోర్ ఫోన్‌లో ‘పెగసాస్’ స్పై వేర్ జాడలు జూన్ 2021లో 14 రోజులు గుర్తించినట్టు ఆయన తెలిపారు. జూలై 2021 లో 12 రోజుల కనిపించాయన్నారు. జూలై 13న ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ - ప్రియాంక గాంధీలను కలిసిన రోజు కూడా ఉండడం విశేషం. వాస్తవానికి, ది వైర్ వెలువరించిన నివేదికలో ప్రశాంత్  కిషోర్ ఫోన్ హాక్ అయినట్టు పేర్కొంది. దానిపై ఫోరెన్సిక్ విశ్లేషణ నిర్వహించడానికి ఇదే కథనం కీలకమైంది.