Begin typing your search above and press return to search.

జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజో అబే దారుణ హ‌త్య‌!

By:  Tupaki Desk   |   8 July 2022 2:34 AM GMT
జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజో అబే దారుణ హ‌త్య‌!
X
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. జ‌పాన్ లోని నారా నగరంలో లిబరల్ డెమొక్రిటిక్ పార్టీ అభ్యర్థుల త‌ర‌ఫున‌ ఆయన ప్రచారంలో ఉండ‌గా ఆయ‌న‌పై కాల్పులు జ‌రిగాయి. వేదికపై డెమొక్ర‌టిక్ అభ్య‌ర్థుల త‌ర‌ఫున ప్రసంగిస్తూ షింజో అబే ఒక్కసారిగా కుప్పకూలిపోయార‌ని ప్ర‌త్య‌క్ష సాక్షులు చెబుతున్నారు.

మొద‌ట ఆయ‌న గుండెపోటుతో కుప్ప‌కూలారని అంతా అనుకున్నారు. అయితే ఆ సమయంలో తుపాకీ కాల్పుల‌ శబ్దం కూడా వినిపించినట్లు జ‌పాన్ లోని స్థానిక మీడియా తెలిపింది. కాగా గుర్తు తెలియని వ్యక్తి షింజో అబేపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. పోలీసులు అత‌డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కాల్పుల‌ ఘటనలో అబే తీవ్రంగా గాయపడ్డారు. బుల్లెట్ గాయాలతో రక్తమోడుతున్న అబేను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా షింజో అబే ఎలాంటి కదలికలు లేవని జ‌పాన్ స్థానిక మీడియా వెల్లడించింది. కాల్పుల‌కు గుర‌య్యాక ఆయ‌న గుండెపోటుకు గుర‌య్యార‌ని స‌మాచారం.

దుండగుడు షింజో అబేపై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడని ప్ర‌త్య‌క్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనలో షింజో ఛాతిలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయని తెలుస్తోంది. ఈ ఘటన స్థానిక కాలమానం ప్రకారం శుక్ర‌వారం రాత్రి 11:30 గంటలకు జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది.

కాగా,షింజో అబే...జపాన్ ప్రధానమంత్రిగా, లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడిగా 2006 నుంచి 2007 వరకు.. మళ్లీ 2012 నుంచి 2020 వరకు పనిచేశారు. 2012లో కొంతకాలం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. జపాన్ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా ఉన్న రికార్డు షింజో అబె పేరు మీదే ఉంది.

అనారోగ్య కార‌ణాల‌తో షింజో అబే ప్ర‌ధాని ప‌ద‌వికి రాజీనామా చేశారు. భార‌త్ కు మంచి మిత్రుడిగా షింజో అబేకు మంచి పేరుంది. ప‌లుమార్లు భార‌త్ లోనూ ప‌ర్య‌టించారు. ఈ నేప‌థ్యంలో షింజో అబేపై కాల్పుల ఘ‌ట‌న భార‌త్ లోనూ క‌ల‌క‌లం సృష్టించింది. ఆయనకు కేంద్రం పద్మవిభూషణ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.