Begin typing your search above and press return to search.

చెల్లని పట్టభద్రులు...నిశానీతో సమానంగా..

By:  Tupaki Desk   |   19 March 2023 9:00 AM GMT
చెల్లని పట్టభద్రులు...నిశానీతో సమానంగా..
X
ఓటు వేయడం అన్నది అలవాటు లేని రోజుల నుంచి మన ప్రజాస్వామ్యం సాఫీగా సాగుతూ వస్తోంది. అయితే నిశానీ గాళ్ళు అప్పట్లో ఎక్కువ మంది ఉండేవారు. వారికి అక్షరాలు రాదు, చదువు లేదు అని వేళాకోళం చేసేవారు. వారి కోసం పార్టీల గుర్తులు పెట్టినది ఈ రోజుకీ అంటే ఏడున్నర దశాబ్దాల కాలంగా అమలు అవుతోంది.

ఈ రోజుకీ అభ్యర్ధి పేరుని చూసి ఓటేసే సీన్ ఈ దేశంలోలేదు. సరే ఎంత చెడ్డా సగటున నలభై శాతానికి పైగా నిరక్షరాస్యులు ఉన్న దేశంగా చెప్పుకుంటారు. దాంతో గుర్తుల మీదనే ఓటింగ్ కంటిన్యూ అవుతోంది. ఇక వారు కాకుండా చాలా ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. అందులో పట్టభద్రుల ఎన్నికలు ముఖ్యంగా ఉన్నాయి.

ఏపీలో మూడు చోట్ల గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరిగితే అన్ని చోట్లా కనీసంగా పది వేల ఓట్లకు తక్కువ కాకుండా చెల్లని ఓట్లు జమ అయ్యాయి. అంటే కచ్చితంగా ముప్పయి వేల ఓట్లు అన్న మాట. ఇంత పెద్ద మొత్తంలో చెల్లని ఓట్లు ఉండడం అంటే ఏమనుకోవాలి.

ఇది చాలా పెద్ద నంబర్. గెలిచిన ఆనదంలో ఒకరు ఓడిన బాధలో మరొకరు పట్టించుకోవడం లేదు కానీ అసలు ఇన్ని వేల ఓట్లు చెల్లకుండా వేసిన వారికి డిగ్రీలు ఎవరిచ్చారు అన్న అతి పెద్ద డౌట్ రాకమానదు. అంతే కాదు పట్టాలు పుచ్చుకోవడం కాదు చదువరులుగా ముద్ర పడడం కాదు ఓటు కూడా వేయడం రాదా సామీ అని ఎదురుగా కనిపిస్తే అడగాలని కూడా చాలా మందికి ఉంది.

ఈ దేశంలో నూరు శాతం అక్షరాస్యత అని పాలకులు ఎపుడూ గొంతు చించుకుంటారు. ఇపుడు చదువుకున్న వారు గ్రాడ్యుయేట్స్ ఓట్లను చెల్లకుండా చేస్తున్న వైనాన్ని చూస్తే చదువు కున్న వారి కంటే నిశానీలే నయం అనిపించకమానదు. ఈవీఎం లు వచ్చాక చాలా మటుకు చెల్లని ఓట్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అదే టైం లో వివిధ సంఘాలకు, అక్షరాస్యులు సభ్యులుగా ఉన్న చోట జరిగే ఎన్నికల్లో చెల్లని ఓట్లు మాత్రం అంతకంతకు పెరిగిపోతున్నాయి.

బాగా చదువుకున్నాక కాకరకాయను పట్టుకుని కీకరకాయ అని అన్నాడన్న సామెతను గుర్తు చేసుకోవాల్సి వస్తోంది. ఏది ఏమైనా సరే చెల్లని ఓట్లు చెల్లని డిగ్రీలతో సమానం అని ఎమ్మెల్సీ ఎన్నికలు నిరూపించాయి. ఇది నగుబాటు మాత్రమే కాదు ప్రజాస్వామ్యానికి పరిహాసం కూడా. ఇదంతా చూసి ఎన్నికల సంఘం రేపో మాపో వీటికి కూడా గుర్తులు పెట్టి ఓటేయడం ఎలాగో ముందే మప్పే కార్యక్రమం చేపట్టాలనుకున్నా తప్పేమీలేదు,

ఆశ్చర్యం అంతకంటే కాదు. అయినా ఏమి చేస్తాం, ఎపుడో దిద్దిన అక్షరాలు, కాళ్ళు అరిగేలా ఉపాధి కోసం తిరిగి బుర్ర కరాబ్ అయిన వేళ చదువుకున్న వారి మెదడుకూ చెదలు పట్టిస్తాయేమో. అందుకే చెల్లని ఓటుగా వారు కూడా చెల్లకుండా పోతున్నారు అనుకోవాలి. జాలి పడాలి కూడా.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.