బడ్జెట్ పై గవర్నర్ సంతకం తప్పనిసరి.. కేసీఆర్/హరీష్ ఎవరు వెళతారు?

Tue Jan 24 2023 21:10:22 GMT+0530 (India Standard Time)

Governor signature on the budget is mandatory KCR and Harish who will go

తెలంగాణ బడ్జెట్ పై కేసీఆర్ సర్కార్ కసరత్తు చేస్తోంది. వచ్చే నెల 3వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అయితే ఇక్కడే ఒక చిక్కుమడి ఉంది.  ఫైనాన్స్ బిల్లు కోసం  గవర్నర్ తమిళిసై అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 202 చెబుతున్నది అదే.  అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంతో ఉప్పు నిప్పులా ఉంది కేసీఆర్ సర్కార్ పరిస్థితి. గవర్నర్ అసెంబ్లీ స్పీచ్ ను కూడా కేసీఆర్ కట్ చేశారు. ఆ కోపం తమిళిసైకి ఉండనే ఉంది. ప్రస్తుతం రాజ్ భవన్ ప్రగతిభవన్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి.ఈ నేపథ్యంలో తెలంగాణ బడ్జెట్ కు గవర్నర్ పర్మిషన్ ఇస్తారా? లేదా? అన్నది సస్పెన్స్ గా మారింది. గవర్నర్ తమిళిసై పర్మిషన్ తీసుకోవడానికి వెళ్లేదెవరనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.

సంతకం కోసం రాజ్ భవన్ ఎవరు వెళతారన్నది ఇప్పుడు ప్రశ్న. పోతే గవర్నర్ స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తి రేపుతోంది. ప్రభుత్వ వర్గాల్లో ప్రస్తుతం ఇదే విషయంపై జోరుగా చర్చ సాగుతోంది. బీజేపీ ప్రతినిధిలా వ్యవహరిస్తుందని  మంత్రులు అధికారులు రాజ్ భవన్ కు వెళ్లడం మానేశారు. గత ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానించినా కూడా సీఎం మంత్రులు రాలేదని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి గౌరవార్థం ఏర్పాటు చేసిన విందుకూ సీఎం వెళ్లలేదు.

కానీ బడ్జెట్ పద్దులపై గవర్నర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. గవర్నర్ సంతకం లేకుండా ప్రస్తుతం ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్ లేదు. దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్లి బడ్జెట్ ను ఆమోదించమని కోరుతారా? లేక మంత్రి హరీష్ రావును పంపిస్తారా? అన్నది ఆసక్తి రేపుతోంది. లేదంటే సెక్రటరీని పంపి పని కానిచ్చేస్తారా? అన్నది వేచిచూడాలి.

అయితే బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ పర్మిషన్ ఇస్తారా? లేక కొంత సమయం తీసుకుంటారా? అన్నది ఆసక్తి రేపుతోంది. విభేదాల నేపథ్యంలో  గవర్నర్ స్పందన ఎలా ఉంటుందన్నది ఉత్కంఠగా మారింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.