ఉద్యోగులకు ప్రభుత్వం షాక్

Tue Jan 18 2022 10:11:03 GMT+0530 (India Standard Time)

Government shock to employees

ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) విషయంలో ప్రభుత్వం షాకిచ్చింది. వేతన సవరణ కొత్త విధానంలో హెచ్ఆర్ఏ విషయంలో భారీ కోతపడింది. హెచ్ఆర్ఏ శ్లాబులను ప్రభుత్వం తగ్గించటం ద్వారా ఉద్యోగులు నష్టపోవటం ఖాయమైంది. ఇప్పటివరకు జిల్లా కేంద్రాలు నగరపాలక సంఘాల్లో 20 శాతం పురపాలక సంఘాలు 50 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో 14.5 శాతం మిగిలిన ప్రాంతాల్లో 12.5 శాతం హెచ్ఆర్ఏ అందుకుంటున్నారు.అయితే తాజా ఉత్తర్వుల ప్రకారం 50 లక్షల జనాభాను మించిన ప్రాంతాల్లో 24 శాతం 5-50 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో 16 శాతం మిగిలిన ప్రాంతాలు 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో 8 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం చెప్పింది. తాజా ఉత్తర్వుల ప్రకారం అర్ధమవుతున్నదేమంటే ఏపిలో పనిచేస్తున్న ఏ ఉద్యోగికి కూడా 24 శాతం హెచ్ఆర్ఏ అందుకునే అవకాశం లేదు. ఎందుకంటే 13 జిల్లాల రాష్ట్రంలో ఎక్కడ కూడా 50 లక్షలున్న నగరం ఒక్కటి కూడా లేదు.

తాజా ఉత్తర్వుల ప్రకారం ఏపీ తరపున ఢిల్లీ హైదరాబాద్ నగరాల్లో పనిచేస్తున్న వారికి  మాత్రమే 24 శాతం హెచ్ఆర్ఏ అందుతుందంతే. ఈ ప్రాంతాలు మినహా వైజాగ్ విజయవాడలోని ఉద్యోగులు కూడా 16 శాతం హెచ్ఆర్ఏ శ్లాబులోనే ఉండిపోతారు. అంటే కచ్చితంగా చెప్పాలంటే 13 జిల్లాల్లో పనిచేసే ఉద్యోగులందరికీ 16 శాతం మించి హెచ్ఆర్ఏ అందుకునే అవకాశమే లేదు. చంద్రబాబు నాయుడు హయాంలో హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు ప్రత్యేకంగా 30 శాతం హెచ్ఆర్ఏ అందుకునే వారు. ఇపుడు వారికి కూడా 14 హెచ్ఆర్ఏలో కోతపడుతుంది.

ఇప్పటివరకు హెచ్ఆర్ఏను రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ధారించే వారు. కానీ ఇక నుండి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం లెక్కించాలని డిసైడ్ చేసింది.

కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం సీసీఏ అంటే సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ లేదు. కాబట్టి ఇక నుండి సీసీఏని కూడా ప్రభుత్వం నిలిపేసింది. విశాఖపట్నం విజయవాడలో పనిచేసే ఉద్యోగులు ఇప్పటివరకు 700 రూపాయలు మిగిలిన ప్రాంతాల్లోని ఉద్యోగులు 500 రూపాయలు అందుకుంటున్నారు. ఇకనుండి ఈ సీసీఏ కూడా ఆగిపోతుంది. ప్రభుత్వం జారీచేసిన తాజా ఉత్తర్వులపై ఉద్యోగ సంఘాల నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.