Begin typing your search above and press return to search.

ప్రత్యేక హోదా... ఎన్ని సార్లు అవమానం భరించాలి ?

By:  Tupaki Desk   |   21 March 2023 3:49 PM GMT
ప్రత్యేక హోదా...  ఎన్ని సార్లు అవమానం భరించాలి ?
X
ఏపీకి ప్రత్యేక హోదా అన్నది బాగా వెటకారం అయింది. వేళాకోళం కూడా అయిపోయింది. విభజన వంటి అతి పెద్ద గాయాన్ని చేసి ఏపీని ఏమీ కాకుండా చేస్దిన సందర్భంలో తాయిలంగా ఇచ్చిన హామీ ఇది. రాజధాని లేకుండా ఒక రాష్ట్రాన్ని విడదీయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. అన్ని విధాలుగా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా అన్నది కొంత వరకూ ఉపశమనం ఇస్తుందని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేక హోదా ప్రకటించారు.

అది కూడా ఆనాడు బీజేపీ ఎంపీలు రాజ్యసభలో ప్రస్తావించిన సందర్భంలో యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇది. ఆనాడు అయిదు కాదు పదేళ్ళు అంటూ గట్టిగా రెట్టించిన బీజేపీ ఆ తరువాత వచ్చేది తామే అని పదిహేనేళ్లు కూడా ఇస్తామని చెప్పి మరీ ఊరించింది. అయితే అసలుకే దిక్కు మొక్కూ లేకుండా ఆ హామీ ఉండిపోయింది. ఇక్కడ కేంద్రం తప్పు ఎంత ఉందో అంతకు ముంచి ఏపీ నుంచి సరైన పోరాటం లేకుండా చేసిన రాజకీయ పార్టీలదీ ఉంది.

ఇక గత తొమ్మిదేళ్ళుగా పార్లమెంట్ లో ప్రత్యేక హోదా గురించి ప్రశ్న రావడం దానికి కేంద్రం ముగిసిన అధ్యాయం అంటూ జవాబు చెప్పడం పరిపాటిగా మారుతోంది. ఏపీకి హోదా ఇవ్వడం కుదరని పని అంటూ కేంద్రం చెబుతూ వస్తోంది. తాజాగా మరోసారి పార్లమెంట్ లో ఇదే అంశం ప్రస్తావననకు వచ్చింది.

అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పందించింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోవడంలేదని పార్లమెంటులో చాలా గట్టిగానే స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమని పేర్కొంది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకే ఈ నిర్ణయం అని కేంద్రం వెల్లడించింది. ఆర్థిక లోటు భర్తీకి 14వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించిందని వివరించింది. దీంతో ప్రత్యేక రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలకు మధ్య అంతరం తొలగిపోయిందని తెలిపింది. హోదాకు బదులుగా ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించామని కేంద్రం స్పష్టం చేసింది. ప్యాకేజీ కింద నిధులు కూడా విడుదల చేశామని వివరించింది.

మొత్తానికి చూస్తూంటే ఏపీకి ప్రత్యక ప్యాకేజీ కింద నిధులు ఇచ్చామని కేంద్రం అంటోంది. ఆ నిధులు కూడా ఖర్చు అయిపోయాయని చెబుతోంది. ఇక హోదాను మరచిపోవాల్సిందే అంటోంది. ఇక్కడ మరో విషయం ఉంది. తరచూ ఢిల్లీకి వెళ్లే సీఎం జగన్ కేంద్రానికి ఇచ్చే వినతిపత్రంలో మొదటి అంశంగా ప్రత్యేక హోదా ఉంటోంది. ఇప్పటికి అనేకసార్లు పార్లమెంట్ లో హోదా ఇవ్వమని కుండబద్ధలు కొట్టిన కేంద్రం ఏపీ ముఖ్యమంత్రికి ఆ మాట చెప్పిందా అన్నదే చర్చ.

ముఖ్యమంత్రి ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల వద్దకు వెళ్లి మరీ ప్రత్యేక హోదా గురించి అడుగుతూనే ఉన్నారు. మరి ఆయనకు ఈ ముక్క చెప్పి ఉంటారా ఒక వేళ చెప్పినా కూడా ఆయన పదే పదే వినతిపత్రంలో ఈ అంశం పెడుతున్నా లైట్ తీసుకుంటున్నారా అన్నది తెలియాల్సి ఉంది.

సీఎం కేంద్ర పెద్దలను కలసిన ప్రతీ సారి ప్రత్యేక హోదా మీద అడిగారు అంటూ ప్రకటనలు వస్తూంటాయి. మరి హోదా మీద ఇంత స్పష్టమైన వైఖరితో కేంద్రం ఉన్నపుడు ఈ వినతులు అన్నీ ఎందుకు అన్న ప్రశ్న కూడా వస్తోంది. ఏది ఏమైనా ఒక్క మాట విభజన హామీలు అయితే ఏపీ ప్రభుత్వానికి సంబంధించి కేంద్రం పెద్దగా చేసింది లేదు అన్న విమర్శలు ఉన్నాయి.

హోదా విషయంలో అయితే ఎన్నో సార్లు ఇవ్వమని చెబుతూ కేంద్రం వస్తోంది. ఇలా ఇవ్వం కాక ఇవ్వమని చెబుతున్న కేంద్రాన్ని పదే పదే ఎందుకు ప్రశ్నలు అడిగి ఏపీ జనాలను అవమానపరుస్తారు అనందే ఇపుడు చర్చగా ఉంది. ఏపీ ప్రజలకు ఆత్మగౌరవం ఉంది. హోదా ఇవ్వను అంటున్న బీజేపీ విషయంలో వారు చేసేది ఏమీ లేదు.

అయితే ఇవ్వమని అన్ని సార్లు ఎందుకు చెప్పించుకోవాలన్న దాంట్లో వారికి ఏ మాత్రం ఊరట లేకుండా ఈ ప్రశ్నలు వస్తున్నాయంటే అడుగుతున్న వారు ఎవరిని మభ్యపెట్టేందుకు అన్న ప్రశ్న వస్తోంది. ఏది ఏమైనా ప్రత్యేక హోదా అన్నది మరీ ఇంతలా హాస్యాస్పదం అవుతుందని ఆనాడు పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చ్చిన మన్మోహన్ సింగ్ కూడా ఊహించి ఉండరేమో.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.