Begin typing your search above and press return to search.

ఏపీ ప్రభుత్వంపై రుణదాతల ఆగ్రహం అందుకేనా?

By:  Tupaki Desk   |   28 Jan 2023 2:20 PM GMT
ఏపీ ప్రభుత్వంపై రుణదాతల ఆగ్రహం అందుకేనా?
X
ఏపీలో జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేస్తున్న అప్పులపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. అభివృద్ధి లేదని.. సంపదను సృష్టించకుండా ఇబ్బడిముబ్బడిగా ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో ఉచిత పంపకాలు చేస్తోందని ఆర్థిక నిపుణులు మండిపడుతున్నారు. ఇలా అయితే ఆంధ్రప్రదేశ్‌ సైతం పొరుగు దేశం శ్రీలంకలా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం ఖాయమనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమయిన సంగతి తెలిసిందే.

మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా రెండు, మూడు వారాలు గడిచాక కానీ అందరి ఖాతాల్లో జీతాలు పడటం లేదని విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్లను తనఖా పెట్టి, రిజర్వ్‌ బ్యాంక్‌ సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొని ఏరోజు కారోజు అన్నట్టు ఏపీ ఆర్థిక పరిస్థితిని లాక్కుస్తుందని విమర్శలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్పొరేషన్లకు తాజాగా అప్పులు ఇచ్చిన రుణదాతలు సైతం జగన్‌ ప్రభుత్వంపైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. తాము అప్పుగా ఇచ్చిన మొత్తాలను రాష్ట్ర ఖజానాకు ఎందుకు మళ్లించారు? ఏ అవసరాల కోసం అప్పులు ఇచ్చాం? మీరు ఏం చెప్పి తీసుకున్నారు? అని రుణాలు ఇచ్చినవారు ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు మీడియా కథనాలు వెల్లడించాయి.

రాష్ట్రానికి చెందిన వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లు ఇటీవల కాలంలో పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్, గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్‌ వంటి వాటి నుంచి రుణాలు తీసుకున్నాయని అంటున్నారు.

ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల మేరకు పోర్టుల నిర్మాణానికి, ఇతరత్రా అవసరాలకు ఆ కార్పొరేషన్లు రుణాలు మంజూరు చేశాయని సమాచారం.

ఇలా ప్రభుత్వ కార్పొరేషన్లకు ఇచ్చిన రుణాలను ప్రభుత్వ ఖజానాకు మళ్లించడం నిబంధనలకు విరుద్ధమని చెబుతున్నారు. జనవరి మూడో వారంలో వివిధ కార్పొరేషన్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.5,000 కోట్ల వరకు మళ్లిపోయాయని అంటున్నారు. దీంతో రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలు, అప్పుల తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వారు గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ వంటి సంస్థలకు ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది.

దీంతో తక్షణమే తాము అప్పుగా ఇచ్చిన నిధుల నిల్వలు చూపాలని రుణదాతలు ప్రభుత్వాన్ని కోరినట్టు చెబుతున్నారు. ఒక వేళ కార్పొరేషన్ల నిధులను ప్రభుత్వ అవసరాల కోసం మళ్లిస్తే కేంద్రం నిర్ణయించిన నికర రుణ పరిమితిలో వాటిని కూడా కలిపి లెక్కించాల్సి ఉంటుందని 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిందని అంటున్నారు.

ఈ క్రమంలో గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్‌ కూడా ఈ అంశంపై దృషి సారించిందని మీడియా కథనాలు పేర్కొంటున్నారు. తాజాగా ఆ కార్పొరేషన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ పేరిట రుణాలు ఇచ్చిందని సమాచారం. తాము ఇచ్చిన మొత్తం నిల్వ ఉందో లేదో చూపాలని రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అధికారులకు నోటీసులు పంపినట్లు టాక్‌ నడుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.