Begin typing your search above and press return to search.

సంక్షోభ వేళ.. ఉద్యోగులకు ఊహించని గిఫ్టు ఇచ్చిన గూగుల్

By:  Tupaki Desk   |   27 May 2020 9:45 AM GMT
సంక్షోభ వేళ.. ఉద్యోగులకు ఊహించని గిఫ్టు ఇచ్చిన గూగుల్
X
ప్రపంచంలో ఎవరినైనా సరే మీరు ఉద్యోగం చేయాలనుకునే టాప్ త్రీ కంపెనీలు ఏమంటే.. అందులో గూగుల్ పేరును చెబుతుంటారు. ఎందుకంటే.. తమ సంస్థలో పని చేసే ఉద్యోగులకు గూగుల్ కల్పించే వసతులే కాదు.. పని ప్రదేశంలో ఉండాల్సిన స్వేచ్ఛ విషయంలోనూ రూటు సపరేటు. అనుక్షణం ఉద్యోగులకు కల్పించే వసతులతో పాటు.. వారి క్రియేటివిటీని పెంచేలా నిర్ణయాలు తీసుకోవటం.. ఆర్థికంగా ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండేలా శాలరీ ప్యాకేజీ ఉంటుంది.

అందుకే.. కలల కంపెనీలా గూగుల్ నిలుస్తుంది. తనకున్న ఇమేజ్ కు తగ్గట్లే తాజాగా తన ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. చాలా కంపెనీల మాదిరి ఇప్పుడున్న సంక్షోభం వేళ.. ఉద్యోగుల జీతాలకు కత్తెరలు వేసే దానికి బదులుగా.. ప్రతి ఉద్యోగికి 1000 డాలర్ల (దగ్గర దగ్గర రూ.70వేలు) చొప్పున భత్యంగా ఇవ్వాలని డిసైడ్ చేసింది. అయితే.. ఈ మొత్తం వర్క్ ఫ్రం హోం చేసే వారికి కావటం విశేషం.

ఎందుకంటే.. ఇంటి నుంచి పని చేసే ఉద్యోగులకు అవసరమైన ల్యాప్ టాప్ లు.. ఇతర హార్డ్ వేర్ పరికరాల కొనుగోలుతో పాటు.. ఇంట్లో ఆఫీసు వాతావరణానికి అనువుగా మార్పులు చేసుకోవటానికి ఈ మొత్తాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. రానున్న మరికొన్ని నెలల పాటు ఇంటి నుంచే గూగుల్ ఉద్యోగులు జాబ్ చేసే అవకాశం ఉంది.

క్లిష్ట సమయంలో ఉద్యోగుల్లో మనోధైర్యాన్ని పెంచేందుకు.. తమ కోసం కంపెనీ ఉందన్న భరోసా కల్పించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రపంచంలోని తమ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగుల్ని వారుండే నగర పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నారు.పరిమిత సంఖ్యలో ఆఫీసుకు ఉద్యోగుల్ని అనుమతించటంతో పాటు.. రొటేషన్ పద్దతిని అమలు చేయాలని భావిస్తున్నారు.