Begin typing your search above and press return to search.

దివాలా ముప్పు తప్పించుకున్న అగ్రరాజ్యం!

By:  Tupaki Desk   |   2 Jun 2023 12:00 PM GMT
దివాలా ముప్పు తప్పించుకున్న అగ్రరాజ్యం!
X
అగ్రరాజ్యం అయినా, అట్టడుగున ఉన్న దేశం అయినా... ఆర్థికపర మైన విషయాల్లో అనుసరించే విధానాలే వారి వారి స్థానాల ను శాసిస్తాయి. అయితే ఈ విషయం లో గత కొంతకాలంగా అగ్రరాజ్యం అమెరికా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కొన్ని సందర్భాల్లో "దివాలా అంచుకు అగ్రరాజ్యం" అనే కథనాలు కూడా ప్రపంచవ్యాప్తంగా హల్ చల్ చేశాయి. ఇందులో భాగంగా... 1 ట్రిలియన్ డాలర్ నాణెం ముద్రించే అవకాశం కూడా ఉందంటూ కథనాలొచ్చాయి. అయితే తాజాగా వాటన్నింటి నీ అధిగమించే వ్యూహాన్ని తెర పైకి తెచ్చి అమెరికా బయటపడిందని తెలుస్తుంది.

ఆదాయాలు తగ్గిపోయి చెల్లిపులు విపరీతంగా పెరిగిపోతే... ఎక్కడ బిల్లులు, ఎక్కడ చెల్లింపులు అక్కడ ఆగిపోతాయి! దాన్నే దివాలా అంటారు! ఈ పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం అయినా ఏమిచేస్తుంది..? అప్పుల పరిమితి ని పెంచుకుంటు పోతుంది! ప్రస్తుతం అగ్రరాజ్యం కూడా అదేపని లో ఉందని తెలుస్తుంది. అవును... ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సమస్యలనుంచి గట్టేక్కాలంటే రుణపరిమితి ని పెంచుకోవటం ఒకటే మార్గం అని అమెరికా భావిస్తుంది. అందుకనే అప్పు పరిమితి ని పెంచుకునేందు కు అనుమతి కోరుతు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ బిల్లు ప్రవేశపెట్టారు.

2021 నాటికి అమెరికన్‌ ప్రభుత్వం తీసుకున్న అప్పు 28.5 లక్షల కోట్ల డాలర్ల కు చేరింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.23,53,09,680 కోట్లు అన్నమాట. ఇది యూఎస్‌ జీడీపీ కంటే 24 శాతం ఎక్కువ. దీంతో మరో ఆప్షన్ లేక అప్పుల పరిమితి ని పెంచుకోవడానికి బైడెన్‌ ప్రభుత్వం కాంగ్రెస్‌ అనుమతి కోరింది.

ఇప్పటికే అమెరికా ప్రభుత్వ అప్పుల పరిమితి 31.4 లక్షల కోట్ల డాలర్లు గా ఉంది. అయినప్పటికీ బిల్లుల పెండింగులు పెరిగిపోతుండటంతో... ఆ పరిమితిని మరింత పెంచాలని కోరింది. అయితే పరిస్థితి ని అర్ధంచేసుకున్న సెనేట్‌ దీనికి ఆమోద ముద్ర వేసింది. ఫలితంగా అప్పుల పరిమితి పెంచుకునేందుకు ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది.

కాగా... రుణ పరిమితి ని పెంచడానికి చట్టసభ ఆమోదం లభించకపోతే అమెరికా ఆర్థిక విపత్తును ఎదుర్కొనే ప్రమాదం ఉందని.. ఇది అగ్రరాజ్యం దివాలా తీయడానికి దారితీయొచ్చని.. దీని ప్రభావం కేవలం అమెరికా పైనే కాకుండా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పై కూడా తీవ్రంగా ఉంటుందని సుమారు మూడు వారల క్రితం ఆ దేశ ఆర్థిక మంత్రి జానెట్‌ యెల్లెన్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే. నాటి నుంచి ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు అమెరికా అనుసరించబోయే విధానం పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే!