Begin typing your search above and press return to search.

కుటుంబమంతటికి కరోనా సోకాలని లేదట

By:  Tupaki Desk   |   4 Aug 2020 1:30 AM GMT
కుటుంబమంతటికి కరోనా సోకాలని లేదట
X
ప్రపంచాన్ని మహమ్మారి వైరస్ అతలాకుతలం చేస్తోంది. కరోనా పేరు చెబితేనే ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తమను ఆ మహమ్మారి వైరస్ ఎపుడు కాటు వేస్తుందో అన్న భయంతో ప్రజలంతా భయం తో బ్రతుకుతున్నారు. మరోవైపు, కరోనా బాధితులు, అనుమానితులపై సమాజం లో వివక్ష నానాటికీ పెరిగిపోతోంది. కరోనా సోకినవారిని, వారి కుటుంబ సభ్యులను ఇరుగుపొరుగువారు, బంధువులు అంటరాని వారిగా చూస్తున్నారు. కరోనా నుంచి కోలుకొని వచ్చిన తర్వాత కరోనా తిరగబెట్టే అవకాశాలు దాదాపుగా లేవని చెబుతున్నా...కరోనాను జయించినవారిని చిన్నచూపుచూస్తున్నారు.

కుటుంబంలో ఒకరికి కరోనా పాజిటివ్ వస్తే... మిగతా కుటుంబసభ్యులకూ కచ్చితంగా కరోనా సోకుతుందని భయపడుతున్నారు. అయితే, ఆ వాదనకు బలం లేదని గుజరాత్‌ లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ సంస్థ వెల్లడించింది. కరోనా సోకిన వ్యక్తి ఉన్న కుటుంబం లో అందరికీ ఆ వైరస్‌ సోకుతుందని కచ్చితం గా చెప్పలేమని ఆ సంస్థ అధ్యయనంలో తేలింది.

కరోనాపై ఉన్న అపోహలను తొలగించేందుకు ఆ సంస్థ ఓ అధ్యయనం చేసింది. కుటుంబంలోని ఒక వ్యక్తికి వైరస్ సోకితే...ఆ కుటుంబంలోని దాదాపు 80% నుంచి 90% సభ్యులకు ఆ వైరస్‌ సోకకపోవచ్చని వెల్లడించింది. మిగతా కుటుంబ సభ్యులలో ఆ వైరస్‌ నిరోధక శక్తి పెరగడమే ఇందుకు కారణం కావచ్చని చెప్పింది. వైరస్‌ సోకిన వ్యక్తిని కలిసిన వారందరికీ వైరస్ సోకుతుందని చెప్పలేమని, ఆ ప్రకారం అయితే కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబం మొత్తం కరోనాబారిన పడాలని వెల్లడించింది. కోవిడ్‌–19తో చనిపోయిన వ్యక్తి కుటుంబాల్లోని వ్యక్తులకూ ఆ వైరస్‌ అంటుకోని ఘటనలున్నాయని చెప్పింది.

ఈ విషయంపై అంతర్జాతీయంగా ప్రచురితమైన 13 పరిశోధనల ఆధారంగా ఈ అధ్యయనం చేశామని ఆ సంస్థ వెల్లడించింది. యూనివర్సిటీ కా లేజ్‌ ఆఫ్‌ లండన్‌ న్యూరో సైంటిస్ట్‌ కార్ల్‌ ఫ్రిస్టన్‌ చెప్పిన ‘ఇమ్యూనలాజికల్‌ బ్లాక్‌ హోల్‌’ సిద్ధాంతం ప్రకారం జనాభాలో 50% మందికి వైరస్‌ సోకే అవకాశం లేదని తెలిపింది. ఇమ్యూనిటీ, ఇళ్లకే పరిమితమవడం, భౌతిక దూరం పాటించడం వంటివి అందుకు కారణం కావచ్చని తెలిపింది. అహ్మదాబాద్‌ లో కేసుల సంఖ్య భారీ గా పెరిగి, తగ్గడానికి `హెర్డ్‌ ఇమ్యూనిటీ` సాధించడమే కారణం కావచ్చని అభిప్రాయపడింది.