ఇద్దరు స్నేహితురాళ్ల సహజీవనం.. తాజాగా స్నేహితురాలిని చంపేసింది

Fri Mar 17 2023 09:54:46 GMT+0530 (India Standard Time)

Girls Living Relationship Made Kill Another Girl

అనూహ్య పరిణామాలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. సంబంధం లేని ప్రేమల పేరుతో మొదలయ్యే రిలేషన్లు.. హింసకు దారి తీయటమే కాదు.. ప్రాణాల్ని తీస్తున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లాలో వెలుగు చూసిన ఉదంతం గురించి తెలిస్తే నోట వెంట మాట రాదు. ఇలా కూడా జరిగిందా? అని ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. వారిద్దరు అమ్మాయిలు. వారి మధ్య మొదలైన స్నేహం చివరకు సహజీవనం వరకు వెళ్లింది. ఈ మధ్యన తన స్నేహితురాలు వేరు అబ్బాయితో సన్నిహితంగా ఉంటుందన్న ఆగ్రహంతో హత్య చేసిన వైనం షాకింగ్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లాకు చెందిన 21 ఏళ్ల అంజలిది మామిడిగట్టు ప్రాంతం.ఆమె తన అమ్మమ్మ ఉండే మన్నెంగూడెంకు వచ్చి వెళుతుండేది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన మహేశ్వరితో పరిచయమైంది. రెండేళ్ల క్రితం మొదలైన వారి స్నేహం ఎంతవరకు వచ్చిందంటే.. మంచిర్యాల పట్టణంలో వారంతా ఒక ఇల్లు అద్దెకు తీసుకొని కలిసి ఉండే వరకు వెళ్లింది. మహేశ్వరితో పాటు.. ఆమె సోదరుడు.. సోదరి కూడా ఉండేవారు. అంజలి ఒక కళ్లద్దాల షాపులో పని చేస్తుంటే.. మహేశ్వరి పెట్రోల్ బంకులో పని చేసేది. ఇటీవల అక్కడ మానేసింది.

ఇటీవల కాలంలో మహేశ్వరి ప్రవర్తన.. వస్త్రధారణ మారిపోతోంది. ఆమె అబ్బాయిలా కనిపించటం మొదలైంది. మహేశ్వరి అంజలి సహజీవనం చేస్తున్నారని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మధ్యన మంచిర్యాలలో కన్సెల్టెన్సీ నిర్వహించే శ్రీనివాస్ తో మహేశ్వరికి పరిచయమైంది.

తనకు పరిచయమైన శ్రీనివాస్ ను తన సోదరి సోదరుడితో పాటు అంజలికి కూడా పరిచయం చేసింది. ఇక్కడే ఒక ట్విస్టు చోటు చేసుకుంది. క్రమంగా శ్రీనివాస్.. అంజలి క్లోజ్ అవుతూ.. మహేశ్వరిని దూరం పెట్టింది. ఇదిలా ఉంటే.. బుధవారం రాత్రి షాపులో పని చేసి వచ్చిన అంజలిని.. రాత్రి పది గంటల వేళలో మామిడిగట్టుకు వెళదామని  మహేశ్వరి కోరింది.

దీంతో ఆమె సరేనని చెప్పటంతో.. వారిద్దరు టూ వీలర్ మీద బయలుదేరారు. కట్ చేస్తే.. రాత్రి 11.30 గంటల వేళలో శ్రీనివాస్ కు ఫోన్ చేసిన మహేశ్వరి.. అంజలి సూసైడ్ చేసుకుందని.. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా పేర్కొంది. దీంతో.. హుటాహుటిన శ్రీనివాస్ కారులో ఆమె చెప్పిన ప్రాంతానికి చేరుకున్నాడు.

అప్పటికే అంజలి మరణించి ఉండగా.. మహేశ్వరి స్వల్ప గాయాలతో ఉంది. అంజలి మెడ మీద లోతైన గాయం ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఇక.. మహేశ్వరి ఒంటిపై స్వల్ప గాయాలు మాత్రమే ఉన్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం శ్రీనివాస్ తో అంజలి క్లోజ్ గా ఉండటాన్ని జీర్ణించుకోలేని మహేశ్వరి ఆమెను చంపేసినట్లుగా భావిస్తున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.  నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.