బాబుకు భారీ రిలీఫ్..గంటా వారు పార్టీ ఆపీసుకి వచ్చారండోయ్

Wed Oct 09 2019 15:31:38 GMT+0530 (IST)

Ganta Srinivas Rao re entered into TDP office

ఇటీవల కాలంలో తన టైం ఏ మాత్రం బాగోలేదని ఫీల్ అవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు.. తాజాగా చోటు చేసుకున్న పరిణామం గొప్ప రిలీఫ్ ను కలిగించి ఉంటుందని చెప్పక తప్పదు. ఇటీవల ముగిసిన ఎన్నికల తర్వాత పార్టీ దారుణ పరాజయం నేపథ్యంలో పార్టీకి చెందిన పలువురు నేతలు జంప్ అయిపోతూ.. చంద్రబాబుకు షాకుల మీద షాకులు ఇవ్వటం తెలిసిందే.అధికారం లేకపోతే.. ఊపిరి ఆడనట్లుగా వ్యవహరించే గంటా శ్రీనివాసరావు కూడా.. పార్టీ నుంచి జంప్ కావటం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగింది. ఈ వాదనకు బలం చేకూర్చేలా ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన పార్టీ ఆఫీసుకు వచ్చింది లేదు. దీంతో.. ఆయన పార్టీ మారే అవకాశం ఉందన్న వాదనలు జోరుగా వినిపించాయి.

గంటా లాంటి నేత కానీ పార్టీ మారితే దాని ప్రభావం టీడీపీ మీద ఎక్కువే అన్న మాట వినిపించింది. ఇదిలా ఉండగా.. తాజాగా పార్టీ ఆఫీసులో నిర్వహిస్తున్న నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశానికి గంటా హాజరయ్యారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ఇప్పటివరకూ పార్టీ ఆఫీసు గడప తొక్కని నేపథ్యంలో.. ఈ రోజు మీటింగ్ కు గంటా వస్తారా? రారా? అన్నది సందేహంగా మారింది.

ఇలాంటి సందేహాలకు చెక్ చెబుతూ గంటా పార్టీ కార్యాలయానికి హాజరయ్యారు. దీంతో.. టీడీపీ అధినేత కొండంత రిలీఫ్ కలుగుతుందన్న మాట తెలుగు తమ్ముళ్ల నోటి నుంచి వినిపిస్తోంది. బాబు సంగతి ఎలా ఉన్నా.. తెలుగు తమ్ముళ్లు మాత్రం గంటా మీటింగ్ కు రావటం గొప్ప రిలీఫ్ గా ఉందని చెప్పటం గమనార్హం.