Begin typing your search above and press return to search.

బస్సులో గ్యాంగ్ రేప్? పోలీసుల దర్యాఫ్తులో షాకింగ్ నిజం

By:  Tupaki Desk   |   27 Sep 2020 1:30 PM GMT
బస్సులో గ్యాంగ్ రేప్? పోలీసుల దర్యాఫ్తులో షాకింగ్ నిజం
X
తెల్లనివన్నీ పాలు కాదు. నల్లనివన్ని నీళ్లు కావు. అలానే బాధితురాలు పేరుతో చెప్పేవన్ని నిజాలు కావన్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు చెప్పినంతనే నమ్మేలా ఉండే విషయాలు.. పోలీసులు దర్యాప్తు షురూ చేసిన తర్వాత కేసు స్వరూపమే మారిపోతుంది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి యూపీలో చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని మీరట్ లో చోటు చేసుకున్న ఉదంతం కలకలాన్ని రేపింది. ఎందుకంటే.. ఢిల్లీలో కదులుతున్న బస్సులో గ్యాంగ్ రేప్ తరహాలోనే తాజా ఉదంతం ఉందన్న సమాచారం అక్కడి వారిని ఆగ్రహంతో ఊగేలా చేసింది. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు.. విషయాల్ని ఒక్కొక్కటిగా సేకరించుకుంటూ వెళ్లేసరికి దిమ్మ తిరిగిపోయే వాస్తవాలు బయటకు వచ్చాయి. ఇంతకూ జరిగిందేమంటే?

రోడ్డు మీద మద్యం మత్తులో అపస్మారక స్థితిలో ఉన్న ఒక మహిళను ఆసుపత్రికి చేర్చారు. పోలీసులు వచ్చి ఆమెను వాంగ్మూలం తీసుకున్న వేళ.. తనను కదులుతున్న బస్సులో డ్రైవర్.. కండెక్టర్ అత్యాచారం చేసినట్లుగా ఆమె చెప్పారు. దీంతో.. షాక్ తిన్న అధికారులు సీరియస్ గా ఈ ఘటన మీద ఫోకస్ చేశారు. పోలీసుల విచారణలో వెల్లడైన సమాచారం వారిని తెల్లముఖం వేసేలా చేసింది. బాధితురాలు చెప్పినట్లుగా ఆమె కదులుతున్న బస్సులో అత్యాచారానికి గురి కాలేదు.

ఆ మాటకు వస్తే.. ఆమెపై జరిగిన లైంగిక దాడికి బస్సు వారికి ఏ మాత్రం సంబంధం లేదని తేల్చారు. ఆమెకు.. ఒక మిలటరీ అధికారికి లైంగిక సంబంధం ఉంది. ఘటన జరిగిన రోజు ఆమె.. సదరు అధికారితో పాటు మరో ఇద్దరితో కలిసి మద్యం సేవించారు. అనంతరం వారు ముగ్గురు ఆమెను రేప్ చేసి.. ఒక వీధిలో వదిలేసి వెళ్లిపోయారు. తాగిన మత్తులో ఉన్న ఆమె రోడ్డు మీద నడుస్తూ.. బస్సుకు అడ్డంగా వచ్చింది.

దీంతో డ్రైవర్.. కండక్టర్ ఆమెపై సీరియస్ అయ్యారు. చావటానికి మా బస్సే దొరికిందా? అంటూ గుస్సా అయ్యారు. తాగొచ్చి తమ ప్రాణాల మీదకు తీసుకొచ్చారని ఫైర్ అయ్యారు. అయోమయంగా ఉన్న ఆమెను స్థానికులు ఆసుపత్రికి చేర్చారు. ఈ సమాచారం పోలీసులకు అందటం.. ఆమెను కలిసిన వారికి.. బస్సు డ్రైవర్..కండక్టర్ తనపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో వారిపై నోటికి వచ్చినట్లుగా అబద్ధాలు చెప్పేసిందన్న విషయాన్ని గుర్తించారు. విచారణలో తమకు లభించిన సమాచారానికి తగ్గట్లే.. ఆమెను బస్సు డ్రైవర్..కండక్టర్ లు ఆగ్రహం వ్యక్తం చేసిన వైనాన్ని సీసీ కెమేరాల్లో చూశారు. తాజాగా ఆమెపై గ్యాంగ్ రేప్ చేసిన మిలటరీ అధికారితో పాటు.. మరో ఇద్దరి కోసం వెతుకుతున్నారు.