న్యూజిలాండ్ ఎంపీగా మనమ్మాయ్.. వయసు తెలిస్తే అవాక్కే

Sun Jan 16 2022 13:26:11 GMT+0530 (IST)

Gaddam Meghana As New Zealand MP

అక్షరాల ఆ అమ్మాయికి పద్దెనిమిదేళ్లు మాత్రమే. ఆ వయసు పిల్లలు స్నేహితులతో పార్టీలు చేసుకోవటం.. సరదాగా  హ్యాంగౌట్ కావటం.. ఖాళీ దొరికితే ఓటీటీల్లో సినిమాలు చూడటం..సోషల్ మీడియాలో చురుగ్గా ఉండటం.. చదువు మీద ఫోకస్ పెట్టటం లాంటివి చేస్తుంటారు. అందుకు భిన్నంగా మనమ్మాయి.. అది కూడా తెలుగు ప్రాంతానికి చెందిన ఒక టీనేజర్ ఇప్పుడు సంచలనంగా మారారు. అతి పిన్న వయసులో న్యూజిలాండ్ పార్లమెంటుకు ఎంపీగా ఎన్నికయ్యారు.ఇప్పటికే విదేశాల్లో మన తెలుగు వారు చట్టసభలకుఎంపిక కావటం తెలిసిందే. అయితే.. అతి పిన్న వయసులోనే దేశ పార్లమెంటుకు ఎంపీగా ఎంపిక కావటం మేఘనే మొదటి వారు అవుతారు. ఈ ఉదంతం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. తెలుగువారు గర్వపడేలా చేసిన ఆ టీనేజ్ సంచలనం పేరు.. గడ్డం మేఘన. ఇంతకీ..అంత చిన్న వయసులో న్యూజిలాండ్ పార్లమెంటుకు ఎలా ఎంపికయ్యారు? అసలేం జరిగింది? అన్న విషయాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా టంగూటూరుకు చెందిన మేఘన తల్లిదండ్రులు 2001లో ఉద్యోగ రీత్యా ఆ దేశానికి వెళ్లారు. అలా 21 ఏళ్ల క్రితం అక్కడకు వెళ్లిన వారికి.. మేఘన అక్కడే జన్మించింది. తెలుగు అమ్మాయేఅయినా.. పుట్టి పెరిగింది న్యూజిలాండ్ లో కాబట్టి.. ఆమెను భారత సంతతి వ్యక్తిగానే చెప్పాలి. పద్దెనిమిదేళ్ల వయసులోనే ఎంపీగా ఎలా ఎన్నికయ్యారన్న విషయానికి వస్తే.. ఆ దేశ పార్లమెంటులోనామినేటెడ్ పదవుల కోసంకొన్ని విభాగాల వారీగా ఎంపిక చేస్తారు. సేవా కార్యక్రమాలు.. యువత విభాగానికి ప్రాతినిధ్యం వహించేలా మేఘనను ఎంపిక చేశారు. న్యూజిలాండ్ యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా వాల్కటో ప్రాంతం నుంచి ఆమె ఎంపిక అయ్యారు.

  కేంబ్రిడ్జిలోని సెయింట్ పీటర్స్ హైస్కూల్లో స్కూలింగ్ చేసిన ఆమె.. అనేక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది.  స్కూల్లో విద్యార్థి నాయకురాలిగా ఉంటూ.. స్టూడెంట్స్ సమస్యలను స్కూల్ యాజమాన్యాల వద్దకు తీసుకెళ్లటం.. వారి సమస్యల్ని పరిష్కరించేలా చేసేది. ఈ క్రమంలో ‘ఆల్ ట్రూజా’ అనే అవార్డును గెలుచుకుంది. భారత సంతతికి చెందిన మేఘనను ఉత్తమ విద్యార్థినిగా ఆమె చదువుతున్న సెయింట్ పీటర్స్ స్కూల్ గుర్తించింది. ఇలా ఒక విదేశీ మూలాలు ఉన్న అమ్మాయికి ఇలాంటి గుర్తింపులభించటం ఇదే తొలిసారి అని చెబుతున్నారు.

తన స్నేహితులతో కలిసి విదేశాల నుంచి న్యూజిలాండ్ కు వలస వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించటంలో ఎంతో కృషి చేసేది. అంతేకాదు.. తాను సేకరించిన విరాళాల్ని అనాథ శరణాలయాలకు ఇచ్చేవారు. ఇలా.. ఓవైపు చదువులో.. మరోవైపు స్కూల్ కు సంబంధించిన అంశాలతో పాటు.. సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న ఆమెను న్యూజిలాండ్ ప్రభుత్వం పార్లమెంటు సభ్యురాలిగా ఎంపిక చేసింది. ఈ ఫిబ్రవరిలో మేఘన ఎంపీగా ప్రమాణం చేయనున్నారు. ఈ తెలుగు టీనేజర్ కు కంగ్రాట్స్ చెబుదామా?