Begin typing your search above and press return to search.

ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. కేసీఆర్ ఏం చేస్తారు?

By:  Tupaki Desk   |   5 Dec 2020 5:04 AM GMT
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. కేసీఆర్ ఏం చేస్తారు?
X
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అధికారం కూడా అంతే. ఒకరి చేతుల్లోనే శాశ్వితంగా ఉండదు. ఆ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని అహంభావానికి గురి కాకుండా.. ఆర్థతతో ప్రజలమనసుల్ని గెలుచుకునే అధినేత ఎవరైనా.. తమ చేతిలోని అధికారాన్ని ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకునే వీలుంటుంది. అందుకు భిన్నంగా నేనేం చేసినా చెల్లుతుంది? నేనేం చెప్పినా ప్రజలు వింటారన్న భావన ఓకే అయినా.. ఆ విశ్వాసం అంతకంతకూ పెరిగితే ఎదురుదెబ్బ తప్పదు. తాజాగా కేసీఆర్ పరిస్థితి అదే.

బీజేపీ తీసుకొచ్చిన భావోద్వేగాల్ని..బ్రాండ్ హైదరాబాద్ పేరుతో అధిగమించాలని గులాబీ బాస్ భావించినా..ఎన్నికల వేళ ఆయన చెప్పే మాటలకు ఈసారి పప్పులు ఉడకలేదు సరికదా.. గతంలో ఎప్పుడూ ఎదురుకాని విషమ పరీక్ష ఇప్పుడు ఆయనకు ఎదురైంది. అడుగు ముందుకు వేస్తే నెయ్యి.. అలా అని వెనక్కి వేస్తే నుయ్యి లాంటి పరిస్థితి. గ్రేటర్ ఎన్నికల్లో మజ్లిస్ తమ మిత్రపక్షం కాదని.. వారితో పొత్తు లేదని అదే పనిగా చెప్పారు కేసీఆర్.. కేటీఆర్. దీనికి తగ్గట్లే మజ్లిస్ నేతలు సైతం టీఆర్ఎస్ పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తాజా ఫలితాల నేపథ్యంలో ఇప్పటివరకు ఎదురుకాని ఇబ్బందికర పరిస్థితి గులాబీ బాస్ కు ఎదురైంది. సొంతంగా మేయర్ పీఠాన్ని సొంతం చేసుకోలేని రీతిలో పార్టీల బలాలు ఉన్నాయి. గ్రేటర్ లో 150 డివిజన్లు ఉంటే.. మేజిక్ మార్కు 76గా చెప్పాలి.కానీ.. ఎక్స్ అఫీషియో ఓట్లనుకూడా పరిగణలోకి తీసుంటే.. దాదాపు 99 ఓట్ల బలం అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ కు 54 డివిజన్లు చేతిలో ఉండగా.. ఎక్స్ అఫీషియోసభ్యులుగా 38 మంది ఉన్నారు. ఇవన్నీ కలిపినా.. మేజిక్ సంఖ్యకు దూరంగా ఉన్నారు.

అదే సమయంలో మజ్లిస్ 42 డివిజన్లలో గెలుపొందింది. వారికి 10 మంది ఎక్స్ అఫీషియో బలం ఉంది. వారు సైతం తమకుతాముగా మేయర్ పీఠాన్ని సొంతం చేసుకోలేరు. ఇలా ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాక.. హంగ్ పరిస్థితి నెలకొనటంతో.. మేయర్ పీఠం ఎవరికి సొంతం కానుందన్నది ఇప్పుడు ప్రశ్న.

మేయర్ ఎంపికకు అవసరమైన మెజార్టీ ఏ పార్టీకి రాని వేళ.. ఎవరో ఒకరి మద్దతు పొందాల్సిన అవసరం టీఆర్ఎస్ కు ఉంది. అయితే.. మజ్లిస్ మద్దతు తీసుకోవాలి. అదే జరిగితే.. టీఆర్ఎస్ - మజ్లిస్ మధ్య ఉన్న మిత్రత్వాన్ని బహిరంగంగా ఒప్పుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే.. తెలంగాణలో టీఆర్ఎస్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపించక మానదు.

ఇప్పటికే బీజేపీ చేస్తున్న ఆరోపణలకు.. విమర్శలకు టీఆర్ఎస్ సమాధానం చెప్పలేని పరిస్థితి. అలాంటిది.. మజ్లిస్ తో కలిసి గ్రేటర్ పీఠాన్ని దక్కించుకుంటే రాజకీయంగా జరిగే నష్టం భారీగా ఉంటుంది. అలా అని.. మజ్లిస్ కు దూరంగా ఉంటానని ఊరుకుంటే.. మేయర్ పీఠం చేజారుతుంది. ఇలాంటివేళ.. టీఆర్ఎస్ కు మజ్లిస్ బయట నుంచి మద్దతు తీసుకునే అవకాశమే మిగిలింది. అలా చేసినా.. కేసీఆర్ విమర్శల్ని ఎదుర్కోక తప్పదు. ఇప్పటివరకు ఇలాంటి సంకట స్థితి కేసీఆర్ కు ఎదురుకాలేదు.