Begin typing your search above and press return to search.

'వృక్ష శిలీంధ్రం' బారిన మనిషి.. ప్రపంచంలోనే తొలి.. భారత్ లోనే

By:  Tupaki Desk   |   1 April 2023 12:12 PM GMT
వృక్ష శిలీంధ్రం బారిన మనిషి.. ప్రపంచంలోనే తొలి.. భారత్ లోనే
X
వైరస్ లు, బ్యాక్టీరియాలు, ఫంగస్ లు.. మనుషుల మీద దాడిచేస్తాయని తెలుసు. వందేళ్ల కిందట వచ్చిన ఫ్లూ లాంటివి ఇప్పటికీ ప్రజలను భయపెడుతున్నాయి. మూడేళ్ల కిందట వచ్చిన కొవిడ్ ఎంతటి భయం రేపిందో అందరికీ తెలిసిందే. అయితే, మానవ పరిణామ క్రమంలో ఇలాంటివి సహజం. ఐదు దశాబ్దాల కిందట వచ్చిన హెచ్ ఐవీకి ఇప్పటికీ మందు లేదు. కొవిడ్ కు మాత్రం ఏడాదిలోనే టీకా కనుగొన్నారు. అయితే, ఇన్నేళ్లలో ఎరుగని ప్రాణ నష్టాన్ని కొవిడ్ ఒక్క సెకండ్ వేవ్ లోనే మిగిల్చింది. ప్రపంచం మొత్తమ్మీద అధికారికంగా ఇప్పటివరకు 68 లక్షలమందిపైనే చనిపోయారు. అనధికారికంగా ఈ సంఖ్య కోటిదాటి ఉంటుంది. ఇక తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటన అత్యంత ఆశ్చర్యకరం. అదేమంటే..

మన భారత్ తోనే..

శిలీంధ్రాలు.. ఇవి ఒక రకమైన సూక్ష్మక్రిములు. ఇవి మట్టిలో విరివిరిగా ఉంటాయి. వీటిలో 70 వేల రకాలను గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా మొక్కల్లో, జంతువుల్లో, మనుషుల్లో వివిధ రకాల వ్యాధులకు కారణమవుతాయి. గాలిలో, నీటిలో, నేలపై, నేలలో, సజీవ, నిర్జీవ దేహాలు.. ఇలా శిలీంధ్రాలు ప్రపంచమంతటా ఉంటాయి. అయితే, వీటిలో అత్యధిక జాతులు కుళ్లుతున్న సేంద్రియ పదార్థాలపై పూతికాహారులుగా మనుగడ సాగిస్తుంటాయి. కాగా, శిలీంధ్రాలు అన్నిటిలో.. నీటిలో నివసించేవి చాలా పురాతనమైనవి. వీటికన్నా పరిణతి చెందినవి మట్టిపై బతికే (మృత్తికావాసం)వి. ఇంకా వీటికన్నా పరిణతి చెందినవి ఏవంటే పరాన్నజీవులు. ఇవి కొన్ని జంతువులు, వృక్షాల దేహాలలో వ్యాధులను కలగజేస్తాయి. కొన్ని శిలీంధ్ర ప్రజాతులు వృక్షాల వేరు వ్యవస్థలలో శిలీంధ్ర మూలాలు (Mycorrhiza) గా ఏర్పడి సహజీవనం చేస్తూ, నీరు, లవణ పోషణకు ఉపకరిస్తాయి.

వృక్ష జాతుల మనుగడకు ఆధారం

చాలా వృక్ష జాతుల (90% పైగా) మనుగడకు శిలీంధ్రాలు ఆధారం. వీటితో సహజీవనం మనుషులకు ప్రాచీన కాలం నుంచే అలవాటైంది. అంటే దాదాపు 400 మిలియన్ సంవత్సరాల నుంచి అని చెబుతారు. శిలీంధ్రాలు మొక్కలు భూమి నుంచి పీల్చుకునే నత్రజని, ఫాస్ఫేట్ మోతాదులను పెంచుతాయి. కొన్ని శిలీంధ్రాలు ఒక మొక్క నుంచి మరో మొక్కకు పిండి పదార్థాలు మొదలైన ఆహార పదార్థాలను తరలిస్తాయి. కాగా, ప్రపంచంలోనే తొలిసారి ఓ వృక్ష సంబంధిత శిలీంధ్రం.. మనిషికి సోకి, అతడి అనారోగ్యానికి కారణమైంది.

అతడి వయసు 61 ఏళ్లు కాగా.. అతడు శాస్త్రవేత్త వృక్ష సంబంధిత మైకాలజిస్ట్ కావడం గమనార్హం. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఓ జర్నల్ లో ప్రచురితమయ్యాయి. సాధారణంగా వృక్ష జాతుల్లో వ్యాధికి కారణమయ్యే ఓ శిలీంధ్రం తొలిసారి ఓ వ్యక్తికి సోకింది. ప్రపంచంలోనే తొలి కేసు అయిన ఇలాంటి ఉదంతం భారత్ లోనే నమోదు కావడం గమనార్హం. 'కొండ్రోస్టీరియం పోర్పోరియమ్‌'.. ఇది ఓ శిలీంధ్రం. చెట్లలో 'సిల్వర్‌ లీఫ్‌' వ్యాధికి కారణమవుతూ ఉంటుంది. ఇప్పుడీ శిలీంధ్రం కోల్‌ కతాకు చెందిన వృక్ష సంబంధిత శిలీంధ్రాలపై పని చేసే ఓ పరిశోధకుడికి సోకింది. అతడికి వైద్యం చేసిన డాక్టర్లు ఈ కేసుకు సంబంధించి రూపొందించిన ఓ నివేదిక.. 'మెడికల్ మైకాలజీ కేస్ రిపోర్ట్స్' జర్నల్‌లో ప్రచురితమైంది.

ఇవీ లక్షణాలు

'కొండ్రోస్టీరియం పోర్పోరియమ్‌'.. లక్షణాలు చూస్తే కొన్ని వైరస్ తరహాలోనే కనిపిస్తున్నాయి. 'గొంతు బొంగురుపోవడం, దగ్గు, ఆయాసం, ఆహారం మింగడానికి ఇబ్బంది, ఆకలి మందగించడం వంటి లక్షణాలు బాధితుడిలో కనిపించాయి. కాగా, ఈయన వివిధ వృక్ష సంబంధిత శిలీంధ్రాలపై ఏళ్లుగా పరిశోధన సాగిస్తున్నారు. అయితే, బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు, గాయాలు లేవు. కుళ్లిపోతున్న పదార్థాలు, పుట్టగొడుగులు, వృక్ష సంబంధిత శిలీంధ్రాలపై చాలా ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే 'కొండ్రోస్టీరియం పోర్పోరియమ్‌' బారినపడ్డరారు. కుళ్లిపోతున్న పదార్థాలతో పని చేయడమే ఈ అరుదైన సంక్రమణకు కారణం కావచ్చు.

ఈ ఇన్ఫెక్షన్ స్వభావం, వ్యాప్తి సామర్థ్యం మొదలైనవి ఇంకా నిర్ధారితం కావాల్సి ఉంది. 'కొండ్రోస్టీరియం పోర్పోరియమ్‌' బారినపడ్డ శాస్త్రవేత్తలో మెడ వద్ద కణితిని గుర్తించి సర్జరీతో తీసివేశారు. తర్వతా 'ఎక్స్-రే' నార్మల్ గానే వచ్చింది. 'యాంటీ- ఫంగల్ ' మందులు పొందారు. కాగా, ఇది జరిగి రెండేళ్లవుతోంది. ఆ శాస్త్రవేత్త ఆరోగ్యంగా ఉన్నారు. మరోసారి వ్యాధి బారినపడతారు అనేందుకు ఆధారాల్లేవు. సంప్రదాయ పరీక్ష విధానాలు (మైక్రోస్కోపీ, కల్చర్) బాధితుడిలో ఫంగస్‌ ఆనవాళ్లను గుర్తించలేకపోయాయి. ప్రస్తుతానికి జన్యు విశ్లేషణ ద్వారా మాత్రమే ఈ అసాధారణ వ్యాధి కారకాన్ని గుర్తించవచ్చు. వృక్ష సంబంధిత శిలీంధ్రాల ద్వారా మనుషులకు వ్యాధి సోకే అవకాశాలు, వాటిని గుర్తించే విధానాల ఆవశ్యకతను ఈ కేసు చాటిచెబుతోంది' అని వైద్యులు తమ నివేదికలో తెలిపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.