Begin typing your search above and press return to search.

అనాథ శవాలకు ఆలింగనంతో 'అంత్యక్రియలు'.. !

By:  Tupaki Desk   |   19 Jun 2021 8:30 AM GMT
అనాథ శవాలకు ఆలింగనంతో అంత్యక్రియలు.. !
X
కరోనా మహమ్మారి మనుషుల్లో ఉన్న మానవత్వాన్ని కూడా మరచిపోయేలా చేసింది. కరోనా మహమ్మారి సోకితే వారిని కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. అది బాగానే ఉంది కానీ , కరోనా తో చనిపోయిన వారికి కనీసం అంత్యక్రియలు చేయడానికి కూడా కొందరు ముందుకు రావడంలేదు. ఇలాంటి తరుణంలోనే కొందరు ముందుకు వచ్చి , కరోనా తో చనిపోయిన మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అలాంటివారిలో ఖమ్మంలోని అన్నం సేవా ఫౌండేషన్‌ నిర్వాహకులు డాక్టర్‌ అన్నం శ్రీనివాసరావు కూడా ఒకరు. అంతిమ సంస్కారాలు చేయడాన్ని దైవ కార్యంగా భావిస్తూ కోవిడ్‌ తొలి, రెండో దశల్లో ఇప్పటివరకు 700 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా విలయ తాండవం చేస్తున్న సమయంలో ఈ మహమ్మారికి భయపడి కుటుంబ సభ్యులు కూడా దగ్గరకు వచ్చేందుకు వెనకడుగు వేసిన వసమయంలో అన్నం తన బృందంతో కలిసి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు.

మొదటి వేవ్‌లో ఉభయ జిల్లాల్లో 500మృతదేహాలకు అంత్యక్రియలు చేశారు. వైరస్‌ ఉధృతి ఆందోళనలో ఉన్న ప్రజలు తమ గ్రామాలకు మృత దేహాలను తీసుకురానీయకుండా రోడ్లపై కంపలేసి అడ్డుకుంటే, ఖమ్మం ప్రకాష్‌నగర్, కాల్వొడ్డుకు చేర్చి అంతిమ సంస్కారం జరిపించారు. కాటికాపర్లు నిరాకరించిన సమయంలో కూడా ఒక్కరోజులో 13మృతదేహాలకు అంత్యక్రియలు చేసిన సందర్భాలున్నాయి. కరోనా రెండో దశలో పొరుగున ఉన్న మహబూబాబాద్, సూర్యాపేట, ఆంధ్రప్రదేశ్‌ లోని కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 200 మందికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మొదటివేవ్‌ తో పోలిస్తే ఈసారి ప్రజల్లో కొంత అవగాహన పెరగడంతో ఇప్పుడు గ్రామాల్లో సర్పంచ్‌ లు, ఇతరుల ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అయినా కూడా ప్రతిరోజూ అన్నం సేవా ఫౌండేషన్‌ కు కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియల కోసం 10కి పైగా ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. అన్నం శ్రీనివాసరావుకు భార్య విజయలక్ష్మి, కుమారుడు అమరేశ్వరరావు, కూతురు హేమలతల సహకారం మరువలేనిది. 16 ఏళ్ల వయసున్న తన మనవరాలు శ్రీదేవి కూడా తాతను అనుసరిస్తూ అంత్యక్రియల్లో పొల్గొంటోంది. చనిపోయాక కొన్ని గంటల తర్వాత మృతదేహం ద్వారా వైరస్‌ వ్యాపించదని అన్నం శ్రీనివాసరావు అవగాహన కల్పించారు. ఖమ్మంలో..కృష్ణాజిల్లా మైలవరం మండలానికి చెందిన వ్యక్తి మరణించగా..మృతదేహాన్ని ఆలింగనం చేసుకుని కుటుంబ సభ్యులను భయపడొద్దని ధైర్యం చెప్పారు. అనేక చోట్ల మృతదేహాలని హత్తుకొని కరోనా సోకదు అనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.