Begin typing your search above and press return to search.

అప్ప‌ట్లో స‌త్య‌వ‌తి.. ఇప్పుడు గురుమూర్తి.. ఏం జ‌రిగిందంటే

By:  Tupaki Desk   |   15 Jan 2022 8:41 AM GMT
అప్ప‌ట్లో స‌త్య‌వ‌తి.. ఇప్పుడు గురుమూర్తి.. ఏం జ‌రిగిందంటే
X
సైబ‌ర్ వ‌ల‌. ఎప్పుడు ఎవ‌రైనా ఈ ఉచ్చులో చిక్కుకునే అవ‌కాశం లేక‌పోలేదు. గ‌తంలో కాకినాడ ఎంపీ బీశెట్టి స‌త్య‌వ‌తి.. ఏకండా రెండు ల‌క్ష‌ల రూపాయ‌లు ఇలానే పోగొట్టుకున్నారు. సైబ‌ర్ నేర‌స్తులు ఏకంగా ఆమెకు ఫోన్ చేసి.. తాము పార్ల‌మెంటు స‌చివాల‌యం నుంచి ఫోన్ చేస్తున్నామ‌ని.. కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కా ల కోసం నిధులు వ‌చ్చాయని.. అయితే.. బ్యాంకు డిపాజిట్ కోసం.. రూ.2 ల‌క్ష‌లుక‌ట్టాల‌ని సూచించారు. దీనిని విశ్వ‌సించిన ఆమె రూ.2 ల‌క్ష‌లు వారు చెప్పిన అకౌంట్‌కు పంపేశారు. త‌ర్వాత‌.. పోన్ లిఫ్ట్ చేయ‌క పోవ‌డంతో పార్ల‌మెంటులోనే ఆమె ఈ స‌మ‌స్య‌ను వెల్ల‌డించారు. దీనిపై దృష్టిపెట్టిన పార్ల‌మెంటు వ‌ర్గాలు.. కేసును విచారించాయి. త‌ర్వాత ఏం జ‌రిగిందో ఇప్ప‌టి వ‌ర‌కు తెలియ‌దు.

ఇక‌, ఇప్పుడు ఇలాంటి ఘ‌ట‌నే వైసీపీ ఎంపీ గురుమూర్తికి కూడా అనుభ‌వంలోకి వ‌చ్చింది. అయితే.. ఆయ‌న తృటిలో త‌ప్పించేసుకోవ‌డ‌మే.. స‌త్య‌వ‌తికి ఈయ‌న‌కు ఉన్న తేడా అంటున్నారు ప‌రిశీల‌కులు విష‌యంలోకి వెళ్తే.. తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తికి సైబర్ దొంగ ఒకడు ఫోన్ చేశారు. తాను ముఖ్య‌మం త్రి కార్యాల‌యం నుంచి మాట్లాడుతున్నానని.. తన పేరును అభిషేక్ గా పరిచయం చేసుకున్నారు. ఖాదీ పరిశ్రమ సబ్సిడీ రుణాల కింద ఆయనకు రూ.5కోట్లు మంజూరు అయినట్లుగా పేర్కొన్నారు. అయితే.. ఆ రుణాన్ని పొందాలంటే మాత్రం తమ అకౌంట్ లో డబ్బులు వేయాలని డిమాండ్ చేశారు.

మొత్తం పాతిక అప్లికేషన్లకు రుణం మంజూరైందని.. ఒక్కో అప్లికేషన్ కు రూ.1.5 లక్షల చొప్పున తాము చెప్పిన ఖాతాలో వేయాలని చెప్పారు. సీఎంవో పేరు చెప్పటం.. మాట్లాడిన వ్యక్తి అనుమానాస్పదంగా లేకపోవటం వరకు బాగానే ఉన్నా.. ఒక్కో అప్లికేషన్ కు రూ.1.5 లక్షల చొప్పున చెల్లించాలని.. బ్యాంకు ఖాతాలో వేయాలని కోరటంతో ఎంపీ గురుమూర్తికి సందేహం వచ్చింది.

వెంటనే ఆయన సీఎంవో కార్యాలయానికి ఫోన్ చేసి.. అభిషేక్ పేరు మీద ఎవరైనా ఉన్నారా? అని ఆరా తీశారు. ఆ పేరు మీద ఎవరూ లేరని.. అలాంటి రుణమేమీ లేదని చెప్పటంతో.. తనకు ఫోన్ చేసి మాట్లాడిన వ్యక్తి సైబర్ దొంగగా ఎంపీ గుర్తించారు. వెంటనే.. ఈ అంశంపై తిరుపతి అర్బన్ ఎస్పీకి కంప్లైంట్ చేశారు. మొయిల్ ద్వారా తనకు పంపిన వివరాల్ని పోలీసులకు అందించారు.

సీఎంవో పేరుతో ఎంపీకే టోకరా కొట్టబోయిన అభిషేక్ ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ తరహా మోసగాళ్లు ఈ మధ్యన ఎక్కువ అయ్యారని.. వీరి విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులతో పాటు.. తాజాగా ఎదురైన అనుభవాన్ని ఎదుర్కొన్న ఎంపీ గురుమూర్తి ప్రజలకు చెబుతున్నారు.