కాంగ్రెస్ ను శైలజానాథ్ కాపాడతారా? కాపాడగలరా?

Fri Jan 17 2020 12:49:28 GMT+0530 (IST)

Former minister Sake Sailajanath appointed as new PCC chief

ఎప్పుడో సార్వత్రిక ఎన్నికలు ముగిశాకా.. రఘువీరారెడ్డి ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆ ఎన్నికలు అయిపోయి నెలలు గడిచిపోయాకా.. ఎట్టకేలకూ ఇప్పుడు ఏపీ పీసీసీకి కొత్త అధ్యక్షుడు నియమితం అయ్యారు. సీనియర్ కాంగ్రెస్ నేత శైలజానాథ్ కు ఆ అవకాశం దక్కింది. ఒకవేళ ఏపీ ఉమ్మడిగానే ఉండి కాంగ్రెస్ కు పాత ఛరిష్మానే ఉండి ఉంటే.. శైలజానాథ్ వంటి వారికి ఈ అవకాశం దక్కేది కాదనేది నిష్టూర సత్యం. ఇప్పుడు కాంగ్రెస్ ను ఏపీ జనాలు పట్టించుకోవడం లేదు. అందుకే ఆ పార్టీ ఏపీ విభాగం అధ్యక్ష పదవి మీద ఎవరికీ ఆసక్తి లేదు. అలా ఎవరూ చేపట్టడానికి కూడా పెద్దగా ఆసక్తి లేని పదవి శైలజానాథ్ కు దక్కింది.శింగనమల నుంచి గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా వ్యవహరించారు శైలజానాథ్. అది ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గం. ఇప్పుడు ఆ దళిత నేతకు కాంగ్రెస్ ఏపీ విభాగం అధ్యక్ష పదవి దక్కింది. ఇలా దళితులను కాంగ్రెస్ ఆకట్టేసుకుంటుంది అనడం అమాయకత్వమే. కాంగ్రెస్ కు ఏపీలోని అన్ని వర్గాల ప్రజలూ దూరం అయ్యారు.

దశాబ్దాలుగా ఆ పార్టీని నిలబెట్టిన రెడ్లు ఓటు బ్యాంకుగా నిలిచిన దళితులు మైనారిటీలు.. ఇలా అందరూ దూరం అయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం చేసిన పాపాలు అలాంటివి. రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా చేసినా దళితుడిని నెత్తిన పెట్టుకున్నా కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఉనికిని చాటే అవకాశాలు లేవు. పరిస్థితులు అలా ఉన్నాయి. విభజనతోనే కాంగ్రెస్ తనకు తాను పాతరేసుకుంది. ఆపై బ్యాలెన్స్ ఏమైనా ఉంటే గత ఏడాది ఎన్నికల ముందు చంద్రబాబుతో చేతులు కలిపి కాంగ్రెస్ మరింత పతనం అయ్యింది. అలాంటిది ఇప్పుడు దళిత కార్డుతో కాంగ్రెస్ ఏదో రాజకీయం చేయాలని చూసినా.. దానితో ఏం ప్రయోజనం ఉండకపోవచ్చని పరిశీలకులు అంటున్నారు.

అసలు శైలజనాథ్ కూడా మంచి అవకాశం ఏదీ రాక.. ఇన్నాళ్లు కాంగ్రెస్ లో మిగిలారు అనేది మరో నిష్టూర సత్యం. ఒక దశలో ఆయన శింగనమల నుంచి పోటీ చేయడానికి తెలుగుదేశం బీఫారం కూడా పొందారు. దాన్ని జేసీ పవన్
లాగేసుకుని అప్పట్లో ఈయనకు టీడీపీ తరఫున నామినేషన్ వేసే అవకాశం లేకుండా చేశారు. అలా కాంగ్రెస్ లోనే మిగిలిపోయిన ఆయనే ఇప్పుడు కాంగ్రెస్ ఏపీ పీసీసీ అధ్యక్షుడయ్యారు.