Begin typing your search above and press return to search.

జగన్ టూర్ లో అవమానం : ఆమెను పొమ్మనకుండా పొగపెడుతున్నారా...?

By:  Tupaki Desk   |   27 Jun 2022 11:30 AM GMT
జగన్ టూర్ లో అవమానం : ఆమెను  పొమ్మనకుండా  పొగపెడుతున్నారా...?
X
ఆమె కేంద్ర మాజీ మంత్రి. ఆమె ప్రతిభను మెచ్చి నాడు వైఎస్సార్ శ్రీకాకుళం కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఏకంగా దిగ్గజ నేత కింజరాపు ఎర్రన్నాయుడుని ఓడించి జెయింట్ కిల్లర్ అనిపించుకున్నారు. ఆమె కిల్లి కృపారాణి. ఆమె వృత్తి రిత్యా వైద్యురాలు. ఆమెకు శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గంలో మంచి పట్టుంది. ఇక ఆమె వైసీపీలో చేరిన నాటి నుంచి అధికార పదవులు అయితే దక్కలేదు. తాజాగా ఆమెకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లా టూర్ సందర్భంగా జగన్ హెలీపాడ్ దగ్గరకు ఆమెను అనుమతించలేదు లిస్ట్ లో ఆమె పేరు లేనందువల్ల హెలీపాడ్ వద్దకు అనుమతించలేదని అధికారులు చెప్పడంతో కిల్లి కృపారాణి ఆగ్రహోదగ్రులయ్యారు. తాను కేంద్రంలో మంత్రిగా పనిచేశాను అని, నిన్నటి దాకా శ్రీకాకుళం జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ ని అని తనను పక్కన పెట్టడమేంటి అని ఆమె మండిపడ్డారు. అయినా సరే అధికారులు తమకు వచ్చిన లిస్ట్ ప్రకారమే సీఎం హెలీపాడ్ వద్దకు నాయకులను పంపుతామంటూ చెప్పడంతో ఫైర్ అయిన కిల్లి కృపారాణి వచ్చిన కారులోనే తిరిగి వెళ్ళిపోయారు.

అయితే ఈ విషయాన్ని పక్కన ఉండి గమనించిన విజాయనగరం ఎంపీ బెల్లాల చంద్రశేఖర్ ఆమెకు నచ్చచెప్పడానికి చూసినా ఆమె కోపం చల్లారలేదు. ఇక ఆమె కారులో కూర్చుని వెళ్ళిపోవడానికి సిద్ధమవుతూండగా అక్కడకు వచ్చిన మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాస్ సముదాయించాలని చూశారు. అయినా ఆమె ఆయన మాట కూడా వినకుండా వెళ్ళిపోయారు. ఆమె టోటల్ గా సీఎం ప్రోగ్రాం నే బాయ్ కాట్ చేశారు.

ఇదిలా ఉంటే కిల్లి కృపారాణికి వైసీపీలో ఈ రకంగా చేసి పొగ పెడుతున్నది ఎవరు అన్న చర్చ సాగుతోంది. ఆమె కాంగ్రెస్ లో ఉన్నపుడు కూడా ధర్మన ప్రసాదరావుతో విభేదాలు ఉండేవి. ఇపుడు ఆయనే రెవిన్యూ మంత్రిగా జిల్లా పార్టీ పెద్దగా ఉన్నారు. మరో వైపు చూస్తే సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దువాడ శ్రీను కూడా ఆమె అంటే గిట్టని వైఖరిని ప్రదర్శిస్తారు.

ఇలా ఆమెకు రాజ్యసభ సీటు దక్కాల్సి ఉన్నా చివరి నిముషంలో రాకుండా పోవడానికి జిల్లాలో వైసీపీలో వర్గ పోరు కారణం అని అంటారు. మరో వైపు కిల్లి కృపారాణికి తెలుగుదేశం నుంచి కూడా ఆహ్వానాలు ఉన్నాయని అంటున్నారు. ఆమె 2019లో వైసీపీ వైపు మొగ్గు చూపారు కానీ దానికంటే ముందే టీడీపీ వారే పిలిచారు. అయితే ఇపుడు వైసీపీలో ఆమెకు ఉక్కబోత ఎక్కువగా ఉండడంతో టీడీపీ వైపు అడుగులు వేస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది.

మొత్తానికి చూస్తే కిల్లి కృపారాణికి పదవులు ఇవ్వలేదు, ఉన్న జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్ పోయింది. ఆమె ఒక సాధారణ నాయకురాలిగా అక్కడ ఉంటున్నారు. దాంతో ఆమె వర్గం అయితే రగులుతోంది. దీని మీద కిల్లి సీరియస్ గానే ఆలోచన చేస్తే మాత్రం వైసీపీకి పెద్ద దెబ్బ అని చెప్పాలి.

ఆమె విద్యాధికురాలు. బలమైన కాళింగ సామాజికవర్గానికి చెందిన నేత. కేంద్ర స్థాయిలో మంత్రిగా పనిచేశారు. రాజకీయంగా కూడా దూసుకుపోయే నేచర్ ఉంది. అలాంటి నాయకులురాలు కనుక పార్టీని వీడితే వైసీపీకి షాక్ అనే భావించాలి. మరి కిల్లి అడుగులు ఎటు పడతాయి. ఆమెను వైసీపీలో ఉంచే పరిస్థితిని అధినాయకత్వం అయినా చేస్తుందా అన్నది చూడాలి.