Begin typing your search above and press return to search.

వైఎస్ వీరభక్తుడు కమ్ మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ కన్నుమూత

By:  Tupaki Desk   |   29 Jan 2023 8:48 AM GMT
వైఎస్ వీరభక్తుడు కమ్ మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ కన్నుమూత
X
మాజీ మంత్రి.. దివంత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీర భక్తుడు అయిన వట్టి వసంత్ కుమార్ ఆదివారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన విశాఖలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించటం.. వైద్య సేవలకు ఆయన శరీరం స్పందించటం మానేసింది. దీంతో ఆయన మరణించిన విషయాన్ని వైద్యులు వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిగా.. వైఎస్ ను అమితంగా ఆరాధించే ఆయన ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా వ్యవహరించారు. పశ్చిమగోదావరి జిల్లా పూండ్లకు చెందిన ఆయన 1955లో జన్మించారు. 2004లో ఉంగటూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన.. మార్గదర్శి ఎపిసోడ్ లోనూ.. ప్రియా పచ్చళ్లలో నాణ్యత లేదంటూ ఒంటికాలిపై విరుచుకుపడేవారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుపై పెద్ద ఎత్తున విమర్శలు చేయటం ద్వారా.. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పేరు ప్రజల్లో నానింది.

2009లోనే ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. రోశయ్య ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోనూ మంత్రిగా నియమితులైనా.. సరేన పదవి అప్పజెప్పలేదన్న ఆగ్రహంతో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాష్ట్ర విభజనతో కలత చెందిన ఆయన రాజకీయాలకు దూరంగా ఉండసాగారు. 2019 ఎన్నికల్లో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుందో.. అప్పటి నుంచి తాను ఎంతో అభిమానించే కాంగ్రెస్ పార్టీ నుంచి దూరమయ్యారు. పదునైన విమర్శలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే వట్టి వసంత కుమార్.. గడిచిన కొన్నేళ్లుగా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉండిపోయారు. విశాఖ నుంచి ఆయన భౌతిక కాయాన్ని సొంతూరుకు తీసుకురానున్నారు. అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు.