Begin typing your search above and press return to search.

ముద్రగడపై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   23 Nov 2021 12:22 PM GMT
ముద్రగడపై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
X
టీడీపీ అధినేత చంద్రబాబు కన్నీళ్లపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం విడుదల చేసిన లేఖ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైంది. చంద్రబాబుది ముసలి కన్నీరు అని.. తన మీడియాతో సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని ముద్రగడ లేఖలో ఆరోపించారు.ఈ మధ్య మీ శ్రీమతికి జరిగిన అవమానం గురించి మీరు వెక్కి వెక్కి ఏడ్వడం టీవీలో చూసి ఆశ్చర్యపోయానని.. మా జాతికి ఇచ్చిన హామీని అమలు చేయమని ఉద్యమం చేస్తే.. నన్ను నా కుటుంబాన్ని మీరు చాలా అవమాన పరిచారు.. మీ కుమారుడు లోకేష్ ఆదేశాలతో పోలీసులు నన్ను బూటుకాలితో తన్నారు. నా భార్య, కుమారుడు , కోడల్ని బూతులు తిడుతూ లాఠీలతో కొట్టారు. 14 రోజుల పాటు ఆస్పత్రి గదిలో నన్ను, నా భార్యను ఏ కారణంతో బంధించారు. మీ రాక్షస ఆనందం కోసం ఆస్పత్రిలో మా దంపతులను ఫొటోలు తీయించి చూసేవారు ’ అంటూ లేఖలో ముద్రగడ కడిగేశారు.మీరు చేసిన హింస తాలుకూ అవమానాన్ని తట్టుకోలేక ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాం.. అణిచివేతతో మా కుటుంబం ఆత్మహత్యకు పూనుకోవాలన్నది మీ ప్రయత్నం కాదా? అని ముద్రగడ ప్రశ్నించారు. నా కుటుంబాన్ని అవమానపరిచిన మీ పతనం నా కళ్లతో చూడాలనే ఉద్దేశంతోనే ఆనాడు ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నానని ముద్రగడ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ముద్రగడ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపడంతో తాజాగా టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. తన ఉనికిని కాపాడుకోవడానికి కాపుల పక్షాన మాట్లాడుతున్నానంటూ ఉత్తుత్తి లేఖలు వదలుంటారని టీడీపీ మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప నిప్పులు చెరిగారు.

కాపులకు న్యాయం చేస్తాను.. వారిని ఉద్దరిస్తానని నమ్మించిన వ్యక్తి చివరకు వారిని కేసుల్లో ఇరికించి జగన్ భయంతో ఇంట్లో దాక్కున్నారన్నారు. చంద్రబాబు కాపులకు చేసిన మేలేంటో ఆ వర్గానికి బాగా తెలుసన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో గానీ, విభజన తర్వాత ఏపీలో గానీ ఏ ముఖ్యమంత్రి కాపులకు చేయని మంచిని చంద్రబాబు చేశారని నవ్యాంధ్ర్యకు తెలిసిన సత్యం అన్నారు.

కాపులకు 5శాతం రిజర్వేషన్లతోపాటు కాపు కార్పొరేషన్, కాపు యువతకు విదేశీ విద్య సహా ఆ వర్గంలోని చిన్నా పెద్దా ముసలి, ముతకా అందరికీ న్యాయం చేసేలా కార్యక్రమాలు అమలు చేశారన్నారు.

కాపులకు మేలు చేస్తున్న వ్యక్తిని ముద్రగడ అడ్డుకున్నారని విమర్శించారు. ముద్రగడకు రాష్ట్రంలోని పరిస్థితులు, ఈ ప్రభుత్వ దుర్మార్గాలు అర్థం కావడం లేదా? అని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి కాపుజాతికి ఏమీ చేయనని తెగేసి చెప్పాక కూడా పద్మనాభం తన ముసుగు తీయకపోతే ఎలా అని ప్రశ్నించారు.

చంద్రబాబు ప్రతిజ్ఞ నెరవేరదని చెప్పడానికి ముద్రగడ ఎవరని.. చంద్రబాబు ప్రతిజ్ఞ నెరవేర్చేవరకూ తామంతా ఆయన వెంట ఉండి దుర్మార్గపు ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలోకి దోషిగా నెలబెడతామన్నారు.

ముద్రగడ కేవలం ఉనికిని కాపాడుకునేందుకే లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు. జగన్ కాపులకు ఏం చేయరు.. రిజర్వేషన్లు ఇవ్వరని..రుణాలు కూడా పక్కదాటి పట్టించారని విమర్శించారు.చంద్రబాబును ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని.. చంద్రబాబు ముద్రగడలా ఇంట్లోకి వెళ్లి కూర్చునే వ్యక్తి కాదని..మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. కాపులకు న్యాయం చేస్తారన్నారు. ఇంట్లో కూర్చొని లేఖలు రాయకుండా బయటకొచ్చి కాపుల కోసం ఫైట్ చేయాలని సూచించారు.