సినిమాల్లో కనిపించే క్యారెక్టర్ ఈ మాజీ ఎమ్మెల్యేది.. కొడుకు పోయిన వేళ కోడలికి పెళ్లి!

Fri Jan 27 2023 16:00:01 GMT+0530 (India Standard Time)

Former MLA Made Marriage of Daughter in Law

కొన్ని ఉదంతాలు రీల్ లైఫ్ లో కనిపిస్తుంటాయి. ఇలాంటివి రియల్ లైఫ్ లో చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి. ఇప్పుడు చెప్పేది ఆ కోవలోకి చెందిన ఉదంతమే. చెట్టంత కొడుకు చిన్న వయసులో చనిపోతే.. అంతకు మించిన నరకం మరొకటి ఉండదు.అలాంటి పరిస్థితుల్లోనూ చనిపోయిన తన కుమారుడి కారణంగా ఒంటరైన తమ కోడలుకు కొత్త జీవితం కోసం తపించే అత్తారింటోళ్లు చాలా చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఇప్పుడు చెప్పే ఉదంతం అలాంటిదే. అయితే.. కోడలి కొత్త జీవితం కోసం ఆరాటపడిన మామ.. ఒక రాజకీయ నాయకుడు కావటం.. గతంలో ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి కావటం ఆసక్తికరంగా మారింది.

ఒడిశాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు పలువురిని ఆకర్షిస్తోంది. ఈ పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలోనూ విపరీతంగా వైరల్ అవుతోంది. ఒడిశాలోని గందియ నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా వ్యవహరించిన నవీన్ నంద. ఆయన పెద్ద కుమారుడు సంబిత్. అతడికి మధుస్మిత అనే యువతితో పెళ్లైంది. వివాహమైనకొంతకాలం బాగానే ఉన్నా.. మాయదారి కరోనా కారణంగా అతడు మరణించాడు. 2021 మేలో అతడు మరణించాడు.

భర్త మరణం తర్వాత కూడా కోడలు అత్తారింటిలోనే ఉండిపోయింది. కోడలి జీవితం గురించి ఆలోచించిన అత్తమామలూ.. ఆమెకు మంచి జీవితం ఉండాలని భావించారు. ఇందుకుతామే.. కోడలితో మాట్లాడి మరో పెళ్లి చేసుకునేందుకు ఒప్పించారు. తాజాగా బాలాసోర్ జిల్లాకు చెందిన శివచందన్ అనే యువకుడితో పెళ్లి ఖరారు చేశారు.

తాజాగా వీరి వివాహం భువనేశ్వర్ లోని దేవాలయంలో జరిగింది. జాతీయ బాలికా దినోత్సవం రోజునే వీరి వివాహం జరిగింది. అయితే.. ముందుగా ప్లాన్ చేసుకోనప్పటికీ అనుకోకుండా జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తన కొడుకు మరణం తర్వాత తన కోడలికి కొత్త జీవితాన్ని అందించాలని తాను భావించానని.. తాను చేసింది తప్పో.. ఒప్పో తెలీదంటూ సదరు మాజీ ఎమ్మెల్యే సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కోడలిగా తమ ఇంటికి వచ్చినప్పటికీ కూతురిగా మారిందన్న ఆయన వ్యాఖ్య అందరిని ఆకర్షిస్తోంది. ఇలాంటివి రీల్ లైఫ్ లో జరుగుతుంటాయి. కానీ.. అందుకు భిన్నంగా రియల్ లైఫ్ లో చోటు చేసుకోవటం హాట్ టాపిక్ గా మారింది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.