ఆ దుకాణంలో పానీపూరి ఎంతపని చేసింది!?

Fri Aug 12 2022 21:00:01 GMT+0530 (India Standard Time)

Food Poison After Eating Panipuri

పానీ పూరీ అంటే ఇష్టపడనివారు ఉండరు. ఇది తెలుగు రాష్ట్రాల వంటకం కానప్పటికీ ఇష్టం తినేవారు మాత్రం కోకొల్లలు. సాయంత్రం 4 దాటిందంటే పానీపూరి బండ్ల దగ్గర రద్దీ మామూలుగా ఉండదు. అయితే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. దీంతో నీరు కలుషితమవుతోంది. పానీపూరీ బండ్లలో పానీపూరి మసాలా వాటర్ లోకి వినియోగించే నీరు కొన్నిచోట్ల సరిగా ఉండని సందర్భాలు గతంలోనూ చూశాం. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగింది.పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలోని సుగంధ గ్రామ పంచాయతీలోని డోగాచియా ప్రాంతంలోని ఒక దుకాణంలో పానీ పూరీ తిన్న 100 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పానీపూరీ తిన్నవారంతా అతిసార లక్షణాలతో బాధపడ్డారు. పానీపూరీ తిన్నవారంతా కడుపు నొప్పి వాంతులు విరోచనాలతో బాధపడ్డారు.

ఈ సమాచారం అందుకున్న వైద్యఆరోగ్య శాఖ అధికారుల ప్రత్యేక బృందం సంఘటనా స్థలానికి చేరుకుని రోగులకు మందులు అందించారు. వారిలో కొంతమంది తీవ్రమైన అనారోగ్యంతో ఉండటంతో వారిని ఆసుపత్రులలో చేర్చారు.

పలువురు తీవ్రంగా ప్రభావితమైన క్రమంలో ఆసుపత్రిలో చేరాలని సూచించారు. కాగా అస్వస్థతకు గురైన వ్యక్తులు పశ్చిమ బెంగాల్లోని డోగాచియా బహిర్ రణగాచా మకల్తలా నివాసితులు.

ఓ దుకాణంలో ముందు పానీపూరి తిన్న హేమంత్ అనే వ్యక్తి తొలుత అస్వస్థతకు గురయ్యాడని.. ఆ తర్వాత సుమారు 100 మంది బాధితులు వాంతులు విరేచనాలు వంటి లక్షణాలతో వరుసగా ఆస్పత్రి పాలైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అటు ప్రత్యేక వైద్య బృందం డొగాచియాలో పర్యటించి మందులు ఓఆర్ఎస్ వంటివి పంపిణీ చేసింది.

అస్వస్థతకు గురైన వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో చాలా మందిని చూచురాలోని ఇమాంబర సదర్ ఆసుపత్రిలో మిగిలిన రోగులను చందన్నగర్లోని ది మహాకుమా ఆసుపత్రికి తరలించారు. కాగా వర్షాకాలంలో పానీపూరి బండ్ల వ్యాపారులు శుభ్రత పాటించాలని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. పానీపూరీకి వినియోగించే నీరు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.