Begin typing your search above and press return to search.

దీనగాథ: వీరప్పన్ కేసులో 31 ఏళ్లుగా జైల్లోనే అనుచరులు

By:  Tupaki Desk   |   19 Oct 2020 10:50 AM GMT
దీనగాథ: వీరప్పన్ కేసులో 31 ఏళ్లుగా జైల్లోనే అనుచరులు
X
రెండు రాష్ట్రాలను వణికించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను ఎలాగోలా పోలీసులు హతమార్చారు. అయితే ఆయన అనుచరులుగా ముద్రపడ్డ వారు మాత్రం ఇప్పటికీ జైల్లోనే నరకయాతన పడుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వీరప్పన్ కేసులో గత 25 ఏళ్లకు పైగానే జైల్లో ఉన్న ఖైదీలను మానవతా దృక్పథంతో విడుదల చేయాలని తమిళనాట ఇప్పుడు డిమాండ్లు వినిపిస్తున్నాయి.

వీరప్పన్ కేసులో కోయంబత్తూర్ జైల్లో ముగ్గురు, మైసూర్ జైల్లో నలుగురు ఖైదీలు యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు.ఇప్పటికే వృద్ధాప్యం, అనారోగ్యంతో ఇద్దరు ఖైదీలు చనిపోయారు. మిగతా ఖైదీలు వయసు పైబడడంతో అనారోగ్యానికి గురయ్యారు. వారిని విడుదల చేసి ఈ వృద్ధాప్యంలో కుటుంబంతో గడిపేలా చేయాలని ఖైదీల కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

1993లో తమిళనాడు-కర్ణాటక సరిహద్దుల్లో మహదేశ్వరం కొండల్లో పొలార్ వంతెనను పేల్చేశారు. ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ ప్లాన్ ప్రకారం జరిగిన ఈ పేలుడులో 22 మంది పోలీసులు చనిపోయారు. ఈ కేసులో సైమన్, పిలవేంద్రన్, మీసై మాధవన్, నాగ ప్రకాశంలు అరెస్ట్ అయ్యారు. మైసూర్ కోర్టు వీరికి యావజ్జీవ శిక్ష విధించింది.

ఇక 1987లో ఈరోడ్ జిల్లాలోని బంగ్లాపూడూర్ దగ్గర ఫారెస్ట్ గార్డులపై వీరప్పన్ కాల్పులు జరిపించాడు. ఈ కేసులో మథైయన్, ఆండియప్పన్, పెరుమాల్ లను అరెస్ట్ చేశారు. వీరికి యావజ్జీవ శిక్ష పడింది. కోయంబత్తూర్ జైల్లో 31 ఏళ్లకు పైగా వీరు శిక్ష అనుభవిస్తున్నారు. వీరిలో ముగ్గురిని విడుదల చేయాలనే తమ డిమాండ్లను తమిళనాడు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.

యావజ్జీవం అంటే ఖైదీలు మొత్తం జీవితం జైల్లోనే గడపాల్సి ఉంటుంది. ఇప్పుడు వారిని 10 లేదా 15 ఏళ్లకే విడుదల చేస్తున్నారు. కోర్టు దానికి అనుమతిస్తున్నప్పటికీ వీరప్పన్ కేసును రాజకీయం చేసి తొక్కి పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు దీన్ని వాడుకుంటున్నాయని.. మానవత్వాన్ని కించపరిచినట్లేనని మానవ హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.