Begin typing your search above and press return to search.

గాలిపటం ఎగురవేస్తున్నారా? మనకున్న చట్టం గురించి తెలుసా?

By:  Tupaki Desk   |   14 Jan 2021 7:46 AM GMT
గాలిపటం ఎగురవేస్తున్నారా? మనకున్న చట్టం గురించి తెలుసా?
X
మిగిలిన రోజుల సంగతి ఎలా ఉన్నా.. సంక్రాంతి వచ్చిందంటే చాలు గాలిపటాలు (పతంగులు)ఎగురవేసే సంప్రదాయం దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పతంగుల జోరు చాలా ఎక్కువ. ఎక్కడ చూసినా పిల్లలు.. పెద్దలు అన్న తేడా లేకుండా హుషారుగా గాలి పటాలు ఎగురవేస్తుంటారు. కానీ.. మీకో విషయం తెలుసా? రూల్ బుక్ ప్రకారం.. పతంగులు ఎగురవేయటం నేరం. వీటిని ఎగురవేయాలంటే ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే లైసెన్స్ తప్పనిసరి.

ఒకవేళ.. అనుమతి లేకుండా పతంగి ఎగురవేస్తే.. చట్టరీత్యా నేరమే కాదు.. వారికి కఠినశిక్షలు వేసే అవకాశం ఉంది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1934-2(1) ప్రకారం గాల్లో ఏ వస్తువు అయినా ఎగురవేయాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి. గాల్లో ఎగిరే వస్తువులను తయారు చేసేందుకు.. వాటిని రిపేర్లు చేసేందుకు లైసెన్సులు ఉండాలి.

డ్రోన్లు.. విమానాలకే కాదు.. గాలి పటాలకు సైతం ఈ రూల్ వర్తిస్తుందని చెబుతారు. ఒకవేళ.. ఎవరైనా ఈ రూల్ ప్రకారం కేసు నమోదు చేస్తే రూ.10లక్షల వరకు జరిమానా విధించే వీలుంది. ఒకవేళ.. నేరాన్ని నిరూపించగలిగితే.. రెండు సంవత్సరాల వరకు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. విమానాలు నడపటానికి ఏ రీతిలో అయితే అనుమతులు తీసుకోవాలో అదే రీతిలో.. గాలి పటాల్ని ఎగురవేయటానికి అనుమతి తప్పనిసరి.

పతంగుల్ని సరదా కోసం చాలామంది ఎగురవేస్తుంటారు. కానీ.. సరదా కోసం.. ఆనందం కోసం ఎగురవేసే వాటి కారణంగా చోటు చేసుకునే ప్రమాదాలు అన్ని ఇన్నికావు. గాలి పటాలకు వాడే చైనా మాంజా అత్యంత ప్రమాదకరమైనది. వీటి కారణంగా పక్షులు చనిపోతుంటాయి. ఆ దారం పక్షుల గొంతుకు చుట్టుకొని ఉరిగా మారి చంపేస్తుంటాయి. గాలి పటాల దారంతో కరెంటు తీగలు రెండు చుట్టుకొని విద్యుత్ పోతుంటుంది. డాబాల మీద పతంగులు ఎగురవేసే క్రమంలో ప్రమాదవశాత్తు జారి పడి చనిపోయిన ఉదంతాలు ఉన్నాయి. పండుగ పూట.. సరదాగా ఎగురవేసే గాలి పటాల వెనుక ఇన్ని అపాయాలు పొంచి ఉన్నాయి. జర.. జాగ్రత్త.