Begin typing your search above and press return to search.

తెలంగాణ వరదలు.. రూ. 15 కోట్ల సాయం ప్రకటించిన ఢిల్లీ సీఎం

By:  Tupaki Desk   |   20 Oct 2020 12:30 PM GMT
తెలంగాణ వరదలు.. రూ. 15 కోట్ల సాయం ప్రకటించిన ఢిల్లీ సీఎం
X
గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. అసలు హైదరాబాద్ లో వర్షం పడితే పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటుందా అనిపించేలా భారీ వరదలతో నగరం మొత్తం సముద్రాన్ని తలపించింది. వర్షాలు తగ్గినప్పటికీ ఇంకా కొన్ని కాలనీలు వరద నీటి ముంపులోనే ఉన్నాయి. అలాగే పలు ప్రాంతాల్లో ఇంకా కరెంట్ ను తిరిగి సరఫరా చేయలేకపోతున్నారు. దీనితో కొన్ని ప్రాంతాల ప్రజలు ఇంకా చీకట్లో ఉన్నారు. ఇలా వరదలతో ఇబ్బందులు పడుతున్న హైదరాబాదీలకు పక్క రాష్ట్రాల నుంచి చేయూత లభిస్తోంది. హైదరాబాద్ వరదలతో బాగా దెబ్బతినడటంతో .. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయక చర్యల కోసం తెలంగాణ ప్రభుత్వానికి రూ .15 కోట్లు విరాళంగా ప్రకటించారు. ఢిల్లీ ప్రజలు హైదరబాద్ పక్షాన నిలబడ్డారని ఆయన అన్నారు.

వరదలు వల్ల హైదరాబాద్ చాలావరకు నాశనం అయింది . ఈ విపత్కర సమయంలో ఢిల్లీ ప్రజలు హైదరాబాద్ ‌లోని సోదర సోదరీమణుల పక్షాన నిలబడుతున్నారు. సహాయక చర్యల కోసం ఢిల్లీ ప్రభుత్వం తరపున తెలంగాణ ప్రభుత్వానకి రూ. 15 విరాళంగా ప్రకటిస్తుంది అని సీఎం క్రేజీవాల్ ట్వీట్ చేశారు. వరదల వల్ల దెబ్బతిన్న హైదరాబాద్ కోసం రూ. 15 కోట్ల ఆర్థికసాయాన్ని ప్రకటించిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కు తెలంగాణ సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.మంగళవారం సీఎం కేజ్రీవాల్‌ కు సీఎం కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. కేజ్రీవాల్ ఎంతో ఉదారత చాటుకుని అండగా నిలిచినందుకు అయనకి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

ఇకపోతే , ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి.. తెలంగాణకు రూ. 10 కోట్ల సాయం ప్రకటించారు. ఈ కష్ట సమయంలో తెలంగాణ ప్రజలకు తమిళనాడు ప్రభుత్వం మద్దతుగా ఉంటుందన్నారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన కుటుంబాలకు బ్లాంకెట్స్, ఇతర రిలీఫ్ మెటీరియల్ పంపిచనున్నట్టు ఆయన చెప్పారు. తక్షణమే రూ. 10 కోట్ల రూపాయలను తెలంగాణ సీఎంఆర్‌ఎఫ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం కోరితే మరే ఇతర సహాయం చేయడానికి తమిళనాడు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. ఇక వరద భాదితులను ఆదుకునేందుకు వ్యాపార, వాణిజ్య ప్రముఖులు ముందుకు రావాలని కేసీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.