Begin typing your search above and press return to search.

చైనాలో విమానాలు రద్దు చేసి.. స్కూళ్లు మూసివేస్తున్నారు

By:  Tupaki Desk   |   22 Oct 2021 4:36 AM GMT
చైనాలో విమానాలు రద్దు చేసి.. స్కూళ్లు మూసివేస్తున్నారు
X
ప్రపంచానికి కరోనాను బహుమతిగా ఇచ్చిన క్రెడిట్ చైనాదే. వూహాన్ లో పుట్టి.. ఆ మహానగరాన్ని వణికించిన మహమ్మారి.. నెమ్మదిగా ఒక్కో దేశానికి వ్యాప్తి చెందటమే కాదు.. యావత్ ప్రపంచం అల్లకల్లోలంగా మారిపోవటం.. కోట్లాది మంది బాధితులు కావటమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా దీని ధాటికి లాక్ డౌన్ విధించిన విపరీత పరిస్థితి గురించి తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా యావత్ ప్రపంచం కిందామీదా పడిపోతున్న వేళ.. చైనాలో అందుకు భిన్నంగా వైరస్ ను విజయవంతంగా లేకుండా చేసినట్లుగావార్తలు రావటం తెలిసిందే. గడిచిన 20 నెలలుగా ప్రపంచంలోని పెద్ద ఎత్తున దేశాలు ఆగమాగమై పోవటానికి కారణమైన కరోనా ఇప్పుడు చైనాను వణికిస్తోంది.

కరోనా కేసులు వరుస పెట్టి నమోదు అవుతున్న వేళ.. చైనా ప్రభుత్వం షాకింగ్ నిర్ణయాల్ని తీసుకుంది. వందల కొద్దీ విమానాల్ని రద్దు చేయటమే కాదు.. స్కూళ్లను సైతం బంద్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. అంతేకాదు.. పెద్ద ఎత్తున పరీక్షల్ని నిర్వహిస్తూ.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇదంతా ఎందుకో తెలుసా? పదుల సంఖ్యలో యాత్రికులు దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించటం.. వారిలో పలువురు కరోనా బారిన పడటమే కారణం.

వారి కారణంగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నట్లుగా గుర్తించిన చైనా ప్రభుత్వం కఠిన చర్యల్ని అమలు చేస్తోంది. అనుమానం ఉన్న విహార ప్రాంతాల్ని మూసివేయటంతో పాటు.. ఎక్కడికక్కడ స్థానిక ప్రభుత్వాలు లాక్ డౌన్లు విధిస్తున్నాయి. షాంఘై మొదలు గ్జియాన్.. గాన్సు ప్రావిన్స్.. ఇన్నర్ మంగోలియాలలో ఇప్పుడీ పరిస్థితి ఉందంటున్నారు. వాయువ్య చైనాలోని లాన్ జూ నగరంలో.. ఎంతో అవసరమైతే తప్పించి ప్రజలు బయటకు రాకూడదన్న ఆంక్షల్ని విధించారు. గ్జియాన్.. లాన్ జూల్లో అరవై శాతం విమానాల్ని రద్దు చేశారు.
ఇక.. బొగ్గు దిగుమతులు భారీగా ఉండే ఇన్నర్ మంగోలియాలోని ఎరెన్ హట్ కు భారీగా రాకపోకల్ని బంద్ చేశారు. దీంతో.. బొగ్గు రవాణా ఆగిపోవటంతో.. మరిన్ని విపరిణామాలు చోటు చేసుకోనున్నట్లు చెబుతున్నారు. ఇంతటి కఠినమైన చర్యల్ని తీసుకోవటానికి కారణం ఏమిటో తెలుసా.. తాజాగా పదమూడు కేసుల్ని నిర్దారించటమే. కరోనా కలకలంతో డ్రాగన్ దేశంలోని వాయువ్య.. ఈశాన్య ప్రాంతాల్లో కఠిన చర్యల్ని తీసుకుంటున్నారు. ప్రపంచానికి బహుమతిగా ఇచ్చిన మహమ్మారి ఇప్పుడా దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతుందన్న మాట వినిపిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని రిపోర్టులు రావాల్సి ఉంది.