Begin typing your search above and press return to search.

ఢిల్లీ నుంచి అమెరికా వెళ్లాల్సిన విమానం.. హ‌ఠాత్తుగా ర‌ష్యాకు ఏం జ‌రిగింది?

By:  Tupaki Desk   |   7 Jun 2023 9:12 AM GMT
ఢిల్లీ నుంచి అమెరికా వెళ్లాల్సిన విమానం.. హ‌ఠాత్తుగా ర‌ష్యాకు ఏం జ‌రిగింది?
X
దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం. ఇక్క‌డ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 173 విమానం బ‌య‌లు దేరింది. ప్ర‌యాణికులు అంద‌రూ ఎంతో ఉత్సాహంగా విమానం ఎక్కారు. వారికి కేటాయించిన సీట్ల‌లో కూర్చున్నారు. స‌మ‌యానికి విమానం కూడా టేకాఫ్ అయింది. కొంద‌రు నిద్ర‌లోకి జారుకున్నారు. ఇంకొంద‌రు పుస్త‌కాలు చ‌దువుకుంటున్నారు. కానీ, ఇంత‌లోనే హ‌ఠాత్తుగా శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లాల్సిన విమానం.. భార‌త స‌రిహ‌ద్దులు దాటాక ఒక్క‌సారిగా గ‌మ‌నం మార్చుకుంది.

అమెరికాకు కాకుండా ర‌ష్యా దిశ‌గా ప‌య‌నం ప్రారంభించి.. అక్క‌డ ల్యాండైంది. దీంతో ప్ర‌యాణికులు.. ఏం జ‌రుగుతోందో తెలియ‌క గ‌గ్గోలు పెట్టారు. కానీ, వారిని అలెర్టు చేస్తూ.. విమానంలోని సిబ్బంది.. ఏం ఫ‌ర్వాలేదు.. అంతా బాగానే ఉందని భ‌రోసా ఇచ్చారు. కానీ, రూట్ మార‌డంతో విమానంలోని ప్ర‌యాణికుల్లో ఆందోళ‌న మాత్రం ఆగ‌లేదు. చివ‌ర‌కు ర‌ష్యాలోనివిమానాశ్ర‌యంలో సుర‌క్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు, అధికారులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.

ఎందుకు జ‌రిగింది?
AI173 ఓ ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైల‌ట్‌ గుర్తించారు. ఈ క్రమంలో వెంటనే విమానాన్ని రష్యా వైపు మళ్లించాలని నిర్ణయించారు. అనంతరం రష్యాలోని మాగదన్ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఆ సమయంలో విమానంలో 216 మంది ప్రయాణికులతోపాటు 16 మంది సిబ్బంది ఉన్నట్లు ఎయిరిండియా వెల్లడించింది. అక్కడ దిగిన వెంటనే ప్రయాణికులకు అవసరమైన వసతి కల్పించడంతోపాటు వారి గమ్యస్థానాలకు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

విమానానికి తప్పనిసరి తనిఖీలన్నీ చేస్తున్నామని ఎయిరిండియా అధికార ప్రతినిధి వెల్లడించారు. కాగా, ప్రయాణికులు విమానాన్ని మళ్లించడంతో కొంత ఆందోళనకు గురయ్యారు. అయితే, విమాన సిబ్బంది ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారని చెప్పారు. ఇక రష్యాలోని విమానాశ్రయంలో ఎయిరిండియా విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో తామంతా ఊపిరిపీల్చుకున్నారు.