ఫ్లాష్.. ఫ్లాష్.. తెలంగాణ గ్రూప్ 1 డీఏవో పరీక్షలు రద్దు

Fri Mar 17 2023 15:02:42 GMT+0530 (India Standard Time)

Flash.. Flash.. Telangana Group 1, DAO Exams Cancelled

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) కఠినమైన అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఏఈఈ డీఏవో పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పేపర్ లీకేజీ కారణంగా ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదిక ఆధారంగా ఈ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. గ్రూప్ -1  ప్రిలిమ్స్ ను జూన్ 11న నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఇవేకాక త్వరలో నిర్వహించనున్న మరిన్ని పరీక్షలను కూడా టీఎస్ పీఎస్సీవాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఒక్కడి కారణంగా వేలాదిమందికి వ్యథ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన గ్రూప్ 1 పరీక్షలు రద్దవడం తెలంగాణ యువతకు అశనిపాతమే. టీఎస్ పీఎస్సీ కి తలవంపులే. ప్రభుత్వానికి చెడ్డ పేరు. వాస్తవానికి తెలంగాణ వచ్చాక రెండుసార్లు గ్రూప్ 2 నిర్వహించారు. రాష్ట్ర స్థాయి సర్వీస్ అయిన గ్రూప్ 1 మాత్రం చేపట్టలేదు. దీనిపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఎట్టకేలకు గత ఏడాది గ్రూప్ 1 నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 16న పరీక్ష నిర్వహించింది. వేలాదిమంది అభ్యర్థులు పరీక్ష రాశారు. మూడు నెలల కిందట ప్రిలిమ్స్ ఫలితాలు వెలువడ్డాయి. 1:50 పద్ధతిలో మెయిన్స్ నిర్వహణకు సిద్ధమయ్యారు. ఇక డీఏవో పరీక్షను గత నెలలో నిర్వహించారు. అంతా సాఫీగా సాగుతున్న వేళ.. టీఎస్ పీఎస్సీ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ కారణంగా తలకిందులైంది. అతడు ఉపాధ్యాయురాలు రేణుక కలిసి ఏఈ పరీక్ష పేపర్ ను లీక్ చేయడం ప్రవీణ్ పెన్ డ్రైవ్ లో మరికొన్ని ప్రశ్నపత్రాలూ ఉండడంతో ఇక్కడివరకు వచ్చింది.

ఏం చేస్తారో..?

తెలంగాణ యువత గ్రూప్ 1 మీద ఎంతో ఆశ పెట్టుకుంది. ఇక గ్రూప్ 2కు ఇటీవల దరఖాస్తు గడువు ముగిసింది. ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు అంటే మళ్లీ కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తారా? ఇప్పటికే పరీక్ష రాసినవారికి మాత్రమే అవకాశం ఇస్తారా.? అలాచేస్తే మిగతా నిరుద్యోగులు ఊరుకుంటారా? అనేది చూడాలి. మరో కీలక పోస్ట్ అయిన డీఏవో విషయంలోనూ ఏం నిర్ణయం తీసుకుంటారనేది కీలకమే. ఇక లీకేజీ ప్రభావం గ్రూప్ 2 గ్రూప్ 4 పైనా పడుతుందా? అనేది సందేహంగా మారింది. ఏదేమైనా తెలంగాణ వచ్చిన ఎనిమిదిన్నరేళ్లకు నిర్వహిస్తున్న గ్రూప్ 1 అనూహ్య పరిస్థితులను ఎదుర్కొంటోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.