ఫ్లాష్.. ఫ్లాష్.. ఏపీ పట్టభద్రుల ఎన్నికల లేటెస్ట్ అప్డేట్స్.. వైసీపీకి షాక్!

Fri Mar 17 2023 09:31:32 GMT+0530 (India Standard Time)

Flash.. Flash.. AP Graduate Election Latest Updates.. Shock for YCP!

ఏపీలో పట్టభద్రులు (గ్రాడ్యుయేట్) ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. కాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సునాయాసంగా గెలుపొందిన అధికార వైసీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చేటప్పటికి చతికిలపడింది.



ఏపీలో మొత్తం మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ విజయం దిశగా దూసుకెళ్తోంది. నాలుగు రౌండ్లు ఓట్ల లెక్కింపు పూర్తి కాగా టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్పై టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు  18371 ఓట్ల భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

కేవలం ఉత్తరాంధ్రలోనే కాకుండా అధికార వైసీపీ అత్యంత బలంగా ఉన్న రాయలసీమలోనూ వైసీపీకి షాక్ తప్పేలా లేదు. ఇక్కడ తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ భారీ ఆధిక్యంగా దూసుకువెళ్తోంది. అక్కడ మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ 9558 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మూడు రౌండ్లలో శ్రీకాంత్ కు 49173 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థి శ్యామ్ ప్రసాద్రెడ్డికి 39615 ఓట్లు వచ్చాయి.

ఇక పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్ర రెడ్డి కేవలం 1943 ఓట్ల ఆధిక్యంలో మాత్రమే ఉన్నారు. మూడు రౌండ్లలో రవీంద్ర రెడ్డి కి 28872 ఓట్లు రాగా.. టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి కి 26929 ఓట్లు వచ్చాయి. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానంలో హోరాహోరీగా పోటీ నడుస్తోంది.

మరోవైపు అనంతపురం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి రామచంద్రారెడ్డి 169 ఓట్ల అతి స్వల్ప మెజారిటీతో గెలిచారు. మూడో ప్రాధాన్యతా ఓట్లతో కానీ ఆయన గెలవలేకపోయారు. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ లెక్కింపు కూడా పూర్తయింది. ఇక్కడ కూడా వైసీపీ మద్దతు తెలిపిన అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి సుమారు 2 వేల ఆధిక్యంతో గెలుపొందారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.