దేశంలోనే ఫస్ట్ టైమ్ ఆ కోర్సు...?

Fri Jan 21 2022 05:00:01 GMT+0530 (India Standard Time)

First time course in the country ...?

భారత దేశంలో ఒక కోర్సుని తేవాలని డిమాండ్ చాలా కాలంగా ఉంది. కానీ వందేళ్ళ కాలం గడిచాకా ఇన్నాళ్ళకు ఆ కోర్సుకు శ్రీకారం చుట్టారు. అదేంటి అంటే హిందూ ధర్మం మీద కోర్సు.  బేసికల్ గా భారత్ హిందూ దేశమనే చెబుతారు. అత్యధికులు హిందువులుగా ఉన్న దేశమిది.అలాంటి  దేశంలో హిందూ ధర్మం మీద కోర్సు ఉండాలని చాలా కాలంగా కోరిక ఉంది. ఇక ఇప్పటికి వందేళ్ళ క్రితం అంటే 1916లో కాశీలో బెనారస్ హిందూ యూనివర్శిటీని ఏర్పాటు చేశారు. మరి హిందూ వర్శిటీ ఉన్నా కూడా హిందూ ధర్మం మీద కోర్సు అయితే ప్రవేశపెట్టలేకపోయారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి.

ఎట్టకేలకు ఇన్నాళ్ళకు హిందూ ధర్మం మీద రెండేళ్ల పీజీ కోర్సుని ప్రారంభించారు. చిత్రమేంటి అంటే ఈ కోర్సులో చేరిన వారిలో ఒక విదేశీ విద్యార్ధి కూడా ఉండడం. ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ విభాగం ద్వారా ఈ కోర్సును అందిస్తోంది బెనారస్ యూనివర్శిటీ. ఈ రెండేళ్ల కోర్సులో నాలుగు సెమిస్టర్స్ పదహారు పేపర్లు ఉంటాయి.

బెనారస్ యూనివర్శిటీ రెక్టార్ వీకే శుక్లా తాజాగా ఈ కోర్సుని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం 2020లో తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానం కింద ఈ కోర్సుని డిజైన్ చేసినట్లుగా యూనివర్శిటీ వర్గాలు తెలియచేస్తున్నాయి.  హిందూ ధర్మం గురించి ఇప్పటిదాకా అనేక రకాలైన అధ్యయనాలు జరిగాయి. అదే విధంగా పూర్వీకుల నుంచి వచ్చిన పురాణాలు ఇతిహాసాలు ఇతర ప్రమాణ గ్రంధాలు ఉన్నాయి.

కానీ ఒక విద్యగా మాత్రం హిందూ ధర్మం గురించి ఒక  కోర్సు అన్నది అయితే ఆధునిక భారతాన లేదు. ఇప్పటికి కొన్ని వందల ఏళ్ల క్రితం గురుకులాలలో హిందూ ధర్మం మీదనే ఎక్కువగా బోధన ఉండేది.  అయితే ఆ తరువాత విదేశీయుల దండయాత్ర తరువాత హిందూ ధర్మం మీదనే ఎక్కువగా  దాడి జరిగింది. కొన్ని వందల ఏళ్ళు భారత్ పరాయి పాలకుల చేతిలో దురాక్రమణకు గురి అయింది. ఈ క్రమంలో హిందూ అన్న మాట కూడా చాలా మందికి మతంగా మారింది. అది రాజకీయంగా కూడా ఆయుధంగా చేసుకున్న శక్తులూ ఉన్నాయి.

అయితే ప్రాచీన అధ్యయనాలు చూస్తే హిందూత్వం అన్నది ఉత్తమైన జీవన విధానాన్ని బోధించే మార్గమే  తప్ప మతాలు అతిశయాలతో అహంకారాలు పోయేది కాదని అంటారు. ఇపుడు ఏకంగా దాన్ని బోధనాపరమైన కోర్సుగా చేశారు కాబట్టి మరింత లోతుగా పరిశోధనలకు ఆస్కారం ఏర్పడుతుంది అని అంతా అంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రపంచంలో ఏకైక హిందూ దేశంగా ఉన్న భారత్ లో హిందూ ధర్మం మీద కోర్సు ప్రవేశపెట్టడానికి ఒక శతాబ్ద కాలం పట్టింది అంటే అది విషాదంగానే చూడాలి అంటున్నారు హిందూ ధార్మిక ప్రచారకర్తలు.