ఏపీలో ఫస్ట్ జీరో ఎఫ్ ఐఆర్..పరుగులు పెట్టిన పోలీసులు

Thu Dec 05 2019 18:52:30 GMT+0530 (IST)

First Zero FIR registered in Andhra Pradesh in a minor missing

దేశవ్యాప్తంగా సంచలనాలు రేకెత్తించిన దిశా అత్యాచార సంఘటన తర్వాత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జీరో ఎఫ్ ఐఆర్‌ను అమల్లోకి తీసుకువచ్చారు. జీరో ఎఫ్ ఐఆర్ కు సంబంధించి ఆగమేఘాల మీద దీనిని అమలు చేశారు. దీని ప్రకారం తమ పరిధిలోకి రానప్పటికీ బాధితులు ఫిర్యాదు చేస్తే పోలీసులు ముందుగా ఎఫ్ ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ జీరో ఎఫ్ ఐఆర్ అమల్లోకి వచ్చాక తొలి ఎఫ్ ఐఆర్ కృష్ణాజిల్లా నందిగామ సబ్ డివిజన్ పరిధిలో గురువారం నమోదయింది. వీరులపాడు మండలం రంగాపురం గ్రామానికి చెందిన ఓ బాలుడి కిడ్నాప్ కేసుకు సంబంధించి పోలీసులు జీరో ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు.బాలుడి తండ్రి రవినాయక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు నందిగామ నియోజకవర్గంలోని వీరులపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోకి వస్తుంది. అయితే రవి నాయక్ ఫిర్యాదుతో వెంటనే పోలీసులు ఈ కేసు తమ పరిధిలోది కాకపోయినా ఎఫ్ ఐఆర్ నమోదు చేసి వెంటనే విచారణ చేపట్టారు. ఆగమేఘాల మీద రెండు బృందాలను రంగంలోకి దిగిన పోలీసులు తెలంగాణలోని మిర్యాలగూడ మండలం లో బాలుడిని గుర్తించి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. దీంతో ఏపీలో తొలి జీరో ఎఫ్ ఐఆర్ కథ సుఖాంతమైంది.

ఇక దిశ విషయంలో ముందుగా కేసు నమోదు కోసం ఆమె తల్లిదండ్రులు వెళ్లినప్పుడు పోలీసులు ఏకంగా రెండు స్టేషన్ల చుట్టూ వాళ్లను పదే పదే తిప్పించారు. ఖచ్చితంగా అదే టైంలో దిశకు అక్కడ జరగరాని దారుణం జరిగింది. ఈ ఘటనపై అంతర్గత విచారణ చేసిన తెలంగాణ పోలీసు శాఖ ముగ్గురు పోలీసు సిబ్బందిపై వేటు వేసింది. ఇక తెలంగాణ పోలీసులు స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఎఫ్ ఐఆర్ నమోదు చేయాలని డిసైడ్ అవ్వగా.. ఇప్పుడు ఏపీ డీజీపీ గౌత్ సవాంత్ సైతం ఇదే విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తున్నారు.