మధ్యప్రదేశ్‌లో హైకోర్టుకు నిప్పు.. లాయర్ల పనే.. రీజనేంటి?

Sat Oct 01 2022 09:58:14 GMT+0530 (India Standard Time)

Fire breaks out at MP High Court

దేశ చరిత్రలోనే తొలిసారి న్యాయవాదులు.. తమకు ఆలయం వంటి న్యాయస్థానానికి.. అందునా రాష్ట్రంలోనే ఉన్నత న్యాయస్థానమైన హైకోర్టుకు  నిప్పు పెట్టారు. మంటలనుఆర్పేందుకు వచ్చిన వారిని కూడా అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత పోలీసుల లాఠీ చార్జీతో రాష్ట్రం ఉద్రిక్తంగా మారింది. కేసు విచారణ వేళ అవమానకర వ్యాఖ్యలు చేశారని హైకోర్టు న్యాయవాది ఒకరు ఆత్మహత్య చేసుకోవడం.. మధ్యప్రదేశ్లోని జబల్పుర్లో పెను దుమారం రేపింది. సహచర లాయర్లు తీవ్రస్థాయిలో నిరసనగా దిగారు. కోర్టులో విధ్వంసానికి పాల్పడ్డారు. న్యాయస్థానానికి నిప్పుపెట్టారు.మధ్యప్రదేశ్ జబల్పుర్లో హైకోర్టు న్యాయవాది ఆత్మహత్య పెను విధ్వంసానికి కారణమైంది. అనురాగ్ సాహూ అనే న్యాయవాది బలవన్మరణానికి పాల్పడగా.. ఆయన తోటి న్యాయవాదులు శుక్రవారం తీవ్రస్థాయిలో నిరసనలు చేపట్టారు. హైకోర్టు ప్రాంగణంలో విధ్వంసానికి పాల్పడ్డారు. న్యాయస్థానానికి నిప్పుపెట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాయర్లపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

అనురాగ్ సాహూ.. జబల్పుర్ హైకోర్టులో న్యాయవాది. ఓ అత్యాచారం కేసులో బాధితుల పక్షాన ఆయన వాదిస్తున్నారు. ఈ కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్పై శుక్రవారం జస్టిస్ సంజయ్ ద్వివేది ధర్మాసనం ఎదుట విచారణ జరిగింది.

ఆ సమయంలో.. అనురాగ్ సాహూకు నిందితుడి తరఫు న్యాయవాదికి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. చివరకు ఇద్దరూ వ్యక్తిగతంగా దూషించుకునే స్థాయికి పరిస్థితి చేరింది. కాసేపటికే కోర్టు నుంచి హడావుడిగా ఇంటికి వెళ్లిపోయారు అనురాగ్ సాహూ. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు.

విషయం తెలిసిన వెంటనే.. తోటి న్యాయవాదులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. అనురాగ్ మృతదేహాన్ని తీసుకుని నేరుగా హైకోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. న్యాయవాదుల నిరసన కాసేపటికే హింసాయుతంగా మారింది. లాయర్లు.. జస్టిస్ సంజయ్ ద్వివేది ఉన్న కోర్టు లోపలకు ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారు. అక్కడి వస్తువులకు నిప్పు అంటించారు.

సమాచారం అందిన వెంటనే పోలీసులు పెద్ద సంఖ్యలో న్యాయస్థానానికి చేరుకున్నారు. అయితే.. వారిని లాయర్లు అడ్డుకున్నారు. మంటలు ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బందినీ చాలాసేపు లోపలకు రానివ్వలేదు. చివరకు.. న్యాయవాదులపై పోలీసులు లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నిరసనలో పాల్గొన్న న్యాయవాదుల్లో చాలా మంది జిల్లా కోర్టుల్లో పనిచేసే వారని అధికారులు తెలిపారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.